
ఆలయ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి
బాపట్ల: శ్రీ భావన్నారాయణస్వామి రథోత్సవానికి తనను ఆహ్వానించక పోవడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు బాపట్ల మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి పేర్కొన్నారు. దేవాలయాన్ని అభివృద్ధి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేశామని, ప్రతి విషయంలో శాస్త్రోక్తంగా ముందుకు పోయామని కోన వివరించారు. ఆదివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. దేవాలయం అభివృద్ధికి వేసిన కమిటీ లెక్కలు అప్పగించలేదంటూ కొంతమంది మాట్లాడుకోవడంలో అర్థం లేదని ఖండించారు. బాపట్లకే తలమానికై న శ్రీభావన్నారాయణస్వామి దేవాలయంలో స్వామి సహా దేవాలయం శిథిలావస్థకు చేరుకుంటే ఎవరకు పట్టించుకోలేదన్నారు. దేవాలయం అభివృద్ధికి ఎంతో కష్టించి పని చేశామని కోన చెప్పారు. దేవాలయాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రముఖ న్యాయవాది కొల్లిమర్ల సత్యనారాయణను చైర్మన్‌గా, కొంతమందిని సభ్యులుగా ఉంచి అభివృద్ధికి శ్రీకారం చుట్టామని వివరించారు. ప్రతి ఒక్క రూపాయికీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఖాతాతోనే నిర్వహణ చేశామని చెప్పారు. పాత రథంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామనే ఉద్దేశంతో కొత్త దానికి తానే స్వయంగా దేవాదాయశాఖ నుంచి కోటి రూపాయలు మంజూరు చేశాయించామని చెప్పారు.రథం నిర్మాణానికి ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులతోపాటు దాతల సహకారం కూడా తీసుకున్నామని తెలిపారు. దాతలుగా మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ రూ.22లక్షలు కూడా ఇచ్చారని వెల్లడించారు. స్తసపతితో పాటు దేవదాయశాఖ నుంచి ఇంజనీర్లు కూడా వచ్చి రథం నిర్మాణానికి పూనుకున్నారని చెప్పారు.
ప్రతి రూపాయికీ లెక్క
కమిటీ నిర్వహణలోనే దేవాలయం, రథం నిర్మాణం జరిగిందని కోన చెప్పారు. ప్రతి రూపాయికీ లెక్కలు ఉన్నాయని, కమిటీ చైర్మన్ సత్యనారాయణ చనిపోవడంతో కొద్దిగా ఆలస్యమైన మాట వాస్తవమేనని పేర్కొన్నారు. మరో పక్షం రోజుల్లో లెక్కలు చూపుతామని చెప్పారు.అక్కడేదో తప్పు జరిగిందంటూ సత్యప్రసాద్ అనే న్యాయవాది ముఖ్యమంత్రికి లేఖ రాశానని చెప్పడం ఆశ్చర్యంగా ఉందని తెలిపారు. లెక్కల్లో వివరాలు కావాలంటే తనను నేరుగా కలిసి అడిగేందుకు అవకాశం ఉందన్నారు. ఆయన ఏదో ఒక రాజకీయ లబ్ధి కోసమే లెక్కలు బయటకు చెప్పాలని పట్టుబడుతున్నారని రఘుపతి దుయ్యబట్టారు.
ఆహ్వానం లేకపోయినా
టెంకాయ కొడతా..
బాపట్లకు పదేళ్లు ఎమ్మెల్యేగా పని చేయడంతో శ్రీ భావన్నారాయణస్వామి దేవాలయం ఉన్నత ప్రతిష్టకు కృషి చేశామని కోన పేర్కొన్నారు. స్వామిని దర్శించుకోవడానికి తనకు ఏ ఆహ్వానం లేకపోయినా ఫర్వాలేదని తెలిపారు. అందరు టెంకాయలు కొట్టిన తరువాత చివరిగా వెళ్లి కొట్టి, మొక్కులు తీర్చుకుంటానని కోన చెప్పారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ పట్టణ, మండల అధ్యక్షులు కాగిత సుధీర్‌బాబు, మరుప్రోలు ఏడుకొండలరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు కోకి రాఘవరెడ్డి, జోగి రాజా, చింతల రాజశేఖర్ పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి దేవాలయం అభివృద్ధి కోసం వేసిన కమిటీ కోరిన వివరాలు వెల్లడిస్తాం కమిటీ చైర్మన్ కొల్లిమర్ల మృతితో జాప్యం రథోత్సవానికి ఆహ్వానం లేకపోవడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం..