
తెల్లారిన బతుకులు
పర్చూరు(చినగంజాం): రాత్రి వేళ పనిచేస్తే అధిక కూలి వస్తుందని ఆశించారు...కానీ ఆ రాత్రే వారికి చివరి రాత్రి అవుతుందని అనుకోలేదు...లారీ రూపంలో ఎదురు వచ్చిన మృత్యువు వారి ప్రాణాలను కబళించింది. గ్రానైట్ పలకల లోడుతో వెళుతున్న లారీపై కూర్చున్న ముగ్గురు కూలీలు వాటి కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం జాతీయ రహదారిపై శనివారం వేకువజామున జరిగింది. బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మార్టూరులో గ్రానైట్ పలకల లోడుతో శనివారం వేకువజామున ఓ లారీ గుంటూరు బయలుదేరింది. గుంటూరు వెళ్లెందుకు డ్రైవర్ మస్తాన్‌వలి లారీని పర్చూరు వైపు మళ్లించాడు. తిమ్మరాజుపాలెం వద్ద రోడ్డు క్రాస్ చేస్తుండగా ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి సడెన్ బ్రేక్ వేయడంతో లారీ ఒక్కసారిగా బోల్తా కొట్టింది. లారీపై కూర్చొని ఉన్న ముగ్గురు కూలీలు గ్రానైట్ పలకల కింద పడి అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వారిలో మార్టూరుకు చెందిన పాలపర్తి శ్రీను (25), తాళ్లూరి ప్రభుదాసు (43), పర్చూరు మండలం నూతలపాడుకు చెందిన తమ్మలూరి సురేంద్ర బాబు(28)గా గుర్తించారు. డ్రైవర్ మస్తాన్‌వలి, క్లీనర్ రమేష్‌లు స్వల్పగాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు, పర్చూరు ఎస్‌ఐ మాల్యాద్రి హుటాహుటిన తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. గ్రానైట్ పలకలను తొలగించి మృతదేహాలను వెలికి తీశారు. రెవెన్యూ అధికారులు సునీత, యార్లగడ్డ శ్రీనివాసరావు, విజయ్ ఆధ్వర్యంలో శవ పంచనామాల అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పర్చూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దృష్టి సారించారు.
అధిక గ్రానైట్ లోడే ప్రమాదానికి కారణం?
లారీలో అధిక గ్రానైట్ పలకల లోడు వేయడం ప్రమాదానికి కారణమై ఉంటుందని పలువురు భావిస్తున్నారు. సామర్థ్యానికి మించి గ్రానైట్ పలకల లోడు లారీలో ఉన్నట్లుగా సమాచారం. రోడ్డు క్రాస్ చేసే సమయంలో ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో లారీ బోల్తా కొట్టిందని భావిస్తున్నారు.
పర్చూరు వైపు లారీ ఎందుకు మళ్లింది?
మార్టూరులో గ్రానైట్ పలకలను లోడు చేసుకున్న లారీ నేరుగా గుంటూరు వెళ్లాల్సి ఉండగా పర్చూరు వైపు ఎందుకు మళ్లించారనే దానిపై అనుమానం వ్యక్తమవుతున్నాయి. గ్రానైట్ లోడుకు సంబంధించి సరైన పత్రాలు ఉన్నాయా? లేవా? అనే అనుమానాలను పలువురు వ్యక్త పరుస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం పోలీసుల విచారణ అనంతరం బయటకు వచ్చే అవకాశం ఉంది.
ముగ్గురూ బంధువులే..
ప్రమాదంలో మృతిచెందిన ముగ్గురూ బంధువులే. పాలపర్తి శ్రీను, మృతుడు సురేంద్రబాబులు బావమరుదులు. సురేంద్రబాబు భార్య రాణి స్వయనా శ్రీను అక్క. శ్రీను, ప్రభుదాసు సమీప బంధువులే. ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురూ ఇలా సమీప బంధువులు కావడం గమనార్హం.
మృతులంతా పేదలే..
రోడ్డు ప్రమాదంలో
ముగ్గురు కూలీలు దుర్మరణం
తిమ్మరాజుపాలెం జాతీయ
రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
రోడ్డు క్రాస్ చేస్తూ అదుపుతప్పి
బోల్తాపడ్డ గ్రానైట్ లారీ
డ్రైవర్, క్లీనర్‌లకు స్వల్ప గాయాలు
ప్రమాదంలో మృతి చెందిన వారంతా మార్టూరు, నూతలపాడు ఎస్సీ కాలనీకి చెందిన పేద కుటుంబాల వారు. రాత్రి వేళ గ్రానైట్ లోడు చేసేందుకు వెళితే అధిక కూలి గిట్టుబాటు అవుతుందని ఆశించి వెళ్లిన వారే. కాగా మార్టూరులో గ్రానైట్ లోడు ఎక్కించడం మరలా గుంటూరు వెళ్లి లోడును దించి రావడం వరకు వారే స్వయంగా ఉంటారు. రోడ్డు ప్రమాదంలో వారు మృతి చెందడంతో ఆయా గ్రామాల కాలనీల్లో తీవ్ర విషాదం నెలకొంది. కూలి కోసం వెళ్లి మృత్యుఒడిలోకి జారుకోవడంతో బంధువులు, కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. మార్టూరు అంబేడ్కర్ కాలనీకి చెందిన తాళ్లూరి ప్రభుదాసు ముగ్గురు ఆడపిల్లల తండ్రి. అతడి భార్య మరియమ్మ కాగా, కుటుంబ బాధ్యత అంతా ప్రభుదాసుపైనే ఉంది. కూలి పనిచేసి సంపాదిస్తేనే వారి కుటుంబం గడిచేది. కానీ ఆయన ఆకస్మిక మరణంతో కుటుంబ సభ్యులకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. పాలపర్తి శ్రీను అదే కాలనీకి చెందిన వాడు కాగా అవివాహితుడు. అతని తండ్రి పేరయ్యతో కలిసి ఉంటున్నాడు. పర్చూరు మండలం నూతలపాడు ఎస్సీ కాలనీకి చెందిన తమ్మలూరి సురేంద్రబాబు తల్లిదండ్రులు చంద్రం, మేరీలు కాగా భార్య రాణి. ఆమె కూడా కూలి పనులకు వెళ్లి వస్తుంటుంది. వీరికి ఇద్దరు మగపిల్లలు కాగా వీరిద్దరు కూలి పనులకు వెళ్లి తీసుకొచ్చిన సంపాదనతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.

తెల్లారిన బతుకులు

తెల్లారిన బతుకులు

తెల్లారిన బతుకులు

తెల్లారిన బతుకులు