
సాయానికి వెళ్లి.. చావు బతుకుల్లోకి..
పెదకూరపాడు: సాయం చేసేందుకు వెళ్లిన వ్యక్తి ప్రమాదానికి గురై చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న సంఘటన మండలంలోని లగడపాడు గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెదకూరపాడు గ్రామానికి చెందిన గుంటూరు నాగేశ్వరరావుకు చెందిన ద్విచక్ర వాహనం గత ఏడాది పెదకూరపాడులో చోరీకి గురైంది. ఈ విషయమై పెదకూరపాడు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో బైక్‌లు చోరీలకు పాల్పడుతున్న పలు వురిని గత నెల 19వ తేదీన అచ్చంపేట పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద దొరికిన వాహనాల్లో నాగేశ్వరరావు వాహనం సైతం ఉండటంతో రికవరీకి శనివారం పెదకూరపాడు పోలీసుస్టేషన్ పీఎస్ హోంగార్డు గుజ్జర్లపూడి రాజేష్‌ఖన్నాతో కలసి నాగేశ్వరరావు వెళ్లాడు. ఆయనకు సహాయంగా పెదకూరపాడుకు చెందిన బత్తుల బ్రహ్మం తన ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. వారు అచ్చంపేట వెళ్లి రికవరీ చేసిన వాహనం రిపేరులో ఉండడంతో దాన్ని వెంట తీసుకెళ్లిన వాహనానికి తాడు కట్టి ఒక వాహనంపై నాగేశ్వరరావు, హోంగార్డులు.. రికవరీ అయిన వాహనంపై గోరంట్ల బ్రహ్మం ఎక్కి తీసుకువస్తున్నారు. ఈక్రమంలో పెదకూరపాడు మండలం లగడపాడు వద్ద ట్రాక్టర్ ఎదురు రావడంతో అదుపు తప్పి ముగ్గురు రోడ్డు పక్కనున్న కందకంలో పడ్డారు. వారిపై రెండు బైకులు పడ్డాయి. ఘటనలో బ్రహ్మం తలకు తీవ్రగాయాలయ్యాయి. పెదకూరపాడు సీహెచ్‌సీలో ప్రథమ చికిత్స అనంతరం,గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. హోంగార్డు రాజేష్‌ఖన్నా కు కుడి కాలికి గాయమైంది. ఆయన్ను సత్తెనపల్లి వైద్యశాలకు తరలించారు. వాహన సొంతదారుడు నాగేశ్వరరావుకు స్వల్పగాయాలయ్యాయి.
చోరీ కేసులో బైక్ రికవరీకి
వెళ్లి వస్తుండగా ప్రమాదం
సహాయంగా వచ్చిన వ్యక్తికి
తీవ్రగాయాలు.. హోంగార్డుకు గాయాలు