
త్వరితగతిన శిక్షలు పడేలా చూడండి
నరసరావుపేట: న్యాయస్థానాల్లో హత్య, హత్యాయత్నం, ఎన్‌డీపీఎస్, పోక్సో, లైంగిక వేధింపుల కేసుల్లో నిందితులు, రౌడీషీటర్లకు త్వరితగతిన శిక్షలు పడేవిధంగా కోర్టు కానిస్టేబుళ్లు సమర్ధవంతంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు సూచించారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో కోర్టు కానిస్టేబుళ్ళతో నిర్వహించిన సమావేశంలో పాల్గొని పలు సూచనలు ఇచ్చారు. జిల్లాలోని అన్నీ పోలీస్‌స్టేషన్లకు సంబంధించి వివిధ న్యాయస్థానాల్లో విచారణలో ఉన్న కేసుల విచారణను వేగవంతం చేసేందుకు తగిన ప్రణాళికలు రూపొందించాలన్నారు. సంబంధిత పోలీస్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ తగిన సాక్ష్యాధారాలను సమర్పించి నిందితులకు త్వరితగతిన శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వివిధ కేసుల్లోని నిందితులు, రౌడీషీటర్ల హాజరు, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న నాన్ బెయిలబుల్ వారంట్ల జారీపై శ్రద్ధ వహించి, వాటి అమలును వేగవంతం చేయాలన్నారు. నిందితుల జాడ తెలియని పక్షంలో ష్యూరిటీలను కోర్టుకు హాజరు పరచి తద్వారా జరగవలసిన ప్రక్రియను చేపట్టాలన్నారు. గత నెలలో ఆయా న్యాయస్థానాల్లో పలు కేసులకు సంబంధించి వచ్చిన తీర్పులు, నిందితులకు పడిన శిక్షలపై హర్షం వ్యక్తం చేశారు. అదనపు ఎస్పీ జేవీ సంతోష్, డీసీఆర్‌బీ సీఐ ఎం.శ్రీనివాసరావు, కోర్టు కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్‌ఐలు పాల్గొన్నారు.
కోర్టు కానిస్టేబుళ్ల సమావేశంలో జిల్లా ఎస్పీ