
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసు అధికారులతో మాట్లాడుతున్న ఐజీ పాలరాజు
పట్నంబజార్(గుంటూరు ఈస్ట్): పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించడంతోపాటు రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు అధికారులను ఆదేశించారు. గుంటూరు రేంజ్ కార్యాలయంలో ఆదివారం గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల అధికారులతో నేర సమీక్ష సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఐజీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రౌడీ షీటర్ల కథలికలపై దృష్టి సారించాలని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని ఆదేశించారు. పోలీసుస్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. కేసు నమోదైన తరువాత కోర్టులో నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకున్నప్పుడే బాధితులకు సరైన న్యాయం చేసి నట్లు అవుతుందని చెప్పారు. ఏదైనా నేరం జరిగిన వెంటనే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని త్వరగా నిందితులను పట్టుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. పెండింగ్ కేసులను జిల్లాల వారీగా విశ్లేషించి వాటి దర్యాప్తును పూర్తి చేయాలని, ఎస్సీ, ఎస్టీ కేసులు సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఐజీ ఆదేశించారు. మహిళలు, బాలికలు, చిన్నారుల అదృశ్యం కేసుల్లో ఫిర్యాదు అందిన వెంటనే ఎటువంటి అలసత్వం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో గుంటూరు రేంజ్ పరిధిలోని ఐదు జిల్లాల ఎస్పీలు, ఏఎస్పీలు, డీఎస్పీలు, టీఏలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు