
వైద్యాధికారులతో జిల్లా కలెక్టర్ శివశంకర్
నరసరావుపేట: పల్నాడు జిల్లాలో లింగ నిర్ధారణ చట్టం–1994ను సమర్థవంతంగా అమలు చేయాల ని జిల్లాస్థాయి మల్టీ మెంబర్ అప్రాప్రియేట్ అథారిటీ కమిటీ ఛైర్మన్, జిల్లా కలెక్టర్ ఎల్. శివశంకర్ వైద్యాధికారులను ఆదేశించారు. లింగ నిర్ధారణ చట్టం కింద నూతనంగా మూడు ఆసుపత్రులకు అనుమతులు ఇచ్చామని, ఏడు ఆసుపత్రులకు రెన్యువల్స్, పది ఆసుపత్రులకు మార్పులను అను మతించడం జరిగిందన్నారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్‌లో అప్రాప్రియేట్ అథారిటీ కమిటీ, జిల్లాస్థాయి అడ్వైజరీ కమిటీ సంయుక్త సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ఈ చట్టం పరిధిని ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్య లు తప్పవన్నారు. లింగ నిర్ధారణ చేయటమనేది చట్టరీత్యా నేరమని, చేసినట్లు తెలిస్తే చట్టపరిధిలో శిక్షార్హులవుతారని హెచ్చరించారు.
జిల్లాలో ఇప్పటి వరకు 146 ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులు లింగ నిర్ధారణ చట్టం పరిధి కింద అనుమతులు ఇవ్వబడ్డాయని, త్వరలో వీరందరితో కలిపి ఒక అవగాహన సమావేశం ఏర్పాటు చేయాలని వైద్యాధికారులకు సూచించారు. కమిటీ సభ్యులైన జిల్లా అదనపు అడ్మిన్ ఎస్పీ జి. బిందుమాధవ్, రెడ్‌క్రాస్ సొసైటీ ప్రతినిధి డాక్టర్ ఎం.వసంత కిరణ్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జి.శోభారాణి, జిల్లా ఇమ్యూనైజేషన్ అధి కారి డాక్టర్ బి.గీతాంజలి, జిల్లా ప్రభుత్వ వైద్యశాలల పర్యవేక్షణాధికారి డాక్టర్ బి.వి.రంగారావు, డాక్టర్ జి గిరిరాజు, డాక్టర్ ఏ శోభారాణి, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పాల్గొన్నారు.
జిల్లా వైద్యాధికారులను
ఆదేశించిన జిల్లా కలెక్టర్