
వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న కలెక్టర్ ఎల్.శివశంకర్
నరసరావుపేట: పల్నాడు జిల్లాలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో పారిశుద్ధ్యం ఎలా ఉందని జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్ అధికారులను ఆరా తీశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం సాయంత్రం సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు పలు మండల కేంద్రాల్లోని ప్రభుత్వ వసతి గృహాలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో రాత్రి బస చేశారు. దీనిపై శుక్రవారం ఉదయాన్నే కలెక్టర్ చేపట్టిన గ్రామోదయం కార్యక్రమం ద్వారా మండల అధికారుల కమిటీ ట్రాన్సెక్ట్ వాక్ పేరుతో పలు ప్రాంతాల్లో పర్యటించారు. అధికారుల పర్యటనలో అక్కడ ఉన్న పరిస్థితులు, గుర్తించిన సమస్యలు, వాటికి చూపిన పరిష్కార మార్గాలు తదితర అంశాలపై శుక్రవారం సాయంత్రం కలెక్టర్ ఎస్‌ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్ హాలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో బడి నిద్ర కార్యక్రమంలో సందర్శించిన పాఠశాలల్లో నాడు–నేడు పథకం ద్వారా జరుగుతున్న పనుల పెండింగ్ అంశాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అధికారులు ఏఏ మండలాల్లో పర్యటించారు. అక్కడ గుర్తించిన సమస్యలు, వాటి పరిష్కార మార్గాలను అడిగి తెలుసుకున్నారు. బడుల్లో రక్తహీనత సమస్యతో బాధపడుతున్న పిల్లలు ఎంతమంది ఉన్నారు. వారికి అధికారులు అందించిన సూచనలు, సలహాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ బడుల్లో తాగునీటి సమస్యను గుర్తించారా? వాటి పరిష్కార మార్గాలు చూపిన విధానాలను జిల్లా కలెక్టర్ కనుక్కొన్నారు. ప్రజలకు ఆధార్ అప్‌డేషన్‌పై అవగాహన కల్పించాలని సూచించారు. ఎన్నికలకు సంబంధించి ఓటర్ కార్డును ఆధార్ కార్డుకు అనుసంధానం చేయాలన్నారు. సమావేశంలో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు, సర్వశిక్ష అభియాన్ అధికారులు, ఆయా సంక్షేమ శాఖల వసతి గృహాధికారులు, స్పెషల్ ఆఫీసర్స్‌తో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
వీడియా కాన్ఫరెన్స్‌లో కలెక్టర్