
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డులో రూ.7 కోట్ల నూతన పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు యార్డు చైర్మన్ మద్దిరెడ్డి సుధాకరరెడ్డి చెప్పారు. మిర్చి యార్డు ఆవరణలోని సమావేశ మందిరంలో మిర్చి యార్డు పాలకవర్గ సమావేశం శుక్రవారం నిర్వహించారు. అనంతరం సమావేశంలో చర్చించిన విషయాలను ఆయన మీడియాకు వివరించారు. మిర్చి యార్డును సుందరంగా తీర్చి దిద్దేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. యార్డును అన్ని రంగాలలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపేలా కృషి చేస్తామని చెప్పారు. యార్డుకు వచ్చే మిర్చి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి ధర లభించేలా చూస్తామని హామీ ఇచ్చారు. రైతులు, వ్యాపారులు, హమాలీలలకు న్యాయం జరిగేలా చూస్తామని పేర్కొన్నారు. ఏడాది మార్కెట్ ఫీజు గత ఏడాది కంటే భారీగా పెరిగిందని, గత ఏడాది రూ.63 కోట్ల మార్కెట్ ఫీజు వసూలు చేయగా, ఈ ఏడాది ఇప్పటికే రూ.87 కోట్లు వసూలు చేయడం జరిగిందని వివరించారు. ఈ నెల చివరికి రూ.90 కోట్లు వసూలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.100 కోట్లు మార్కెట్ ఫీజు లక్ష్యంగా పాలకవర్గం, అధికారుల సమన్వయంతో ముందుకు సాగుతున్నామని వెల్లడించారు. అనంతరం చైర్మన్ మద్దిరెడ్డి సుధాకరరెడ్డిని ఎక్స్‌ఫిషియో సభ్యుని హోదాలో సమావేశానికి హాజరైన గుంటూరు నగర మేయర్ కావటి శివనాగ మనోహర్‌నాయుడు సత్కరించారు. సమావేశంలో మేయర్ కావటి శివనాగ మనోహర్‌నాయుడు, యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఐ.వెంకటేశ్వరరెడ్డి, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
వచ్చే ఏడాది మార్కెట్ ఫీజు లక్ష్యంరూ.100 కోట్ల మిర్చి యార్డు పాలకవర్గ సమావేశంలో చైర్మన్ సుధాకరరెడ్డి వెల్లడి