
మహిళకు ధ్రువీకరణ పత్రం అందజేస్తున్న నాబార్డు డీడీఎం కార్తీక్
శావల్యాపురం: గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల సభ్యులు అభ్యున్నతికి ప్రభుత్వ సహకారం అభినందనీయమని ఉమ్మడి గుంటూరు జిల్లా నాబార్డు డీడీఎం కేఆర్‌డీ కార్తీక్ అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నాబార్డు సౌజన్యంతో నేచురల్ హెల్త్ కేర్ సొసైటీ ఆధ్వర్యంలో జూట్ బ్యాగ్స్ తయారీపై శిక్షణ తీసుకున్న మహిళలకు ధ్రువీకరణ పత్రాలు శుక్రవారం పంపిణీ చేశారు. కార్తీక్ మాట్లాడుతూ జ్యూట్ బ్యాగ్‌లు తయారీలో నెల రోజుల పాటు ఉచితంగా మహిళ సభ్యులకు శిక్షణ ఇవ్వటంతో పాటు బ్యాంకు పరంగా రుణాలు మంజూరు చేయించి యూనిట్స్ ఏర్పాటు చేసేలా వారి అభ్యున్నతికి నాబార్డు అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకుంటామని చెప్పారు. నాబార్డు తరఫున శిక్షణ తరగతుల్లో పాల్గొన్న మహిళలకు నెలకు రూ.600 మంజూరు చేశామన్నారు. గ్రామీణ దుకాణ్ పథకంలో భాగంగా నాబార్డు నిధులతో రెండు సంవత్సరాల పాటు గది అద్దెలు, విద్యుత్ చెల్లింపులతో ఒక మహిళకు ఉపాధి కల్పించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే వివిధ రంగాల్లో నైపుణ్యం సాధించిన మహిళలందరూ వారి వారి ఉత్పత్తులను మార్కెటింగ్ చేయటానికి దోహదపడుతుందన్నారు. నూజెండ్లలో నాబార్డు సహకారంతో ఎఫ్‌పీఓ ద్వారా పాల ఉత్పత్తిదారుల అభివృద్ది పొందవచ్చునన్నారు. కూరగాయలు సాగు చేసే రైతులకు ప్రత్యేకంగా గిట్టుధర ఉండేలా విఠంరాజుపల్లెలో మార్కెటు యార్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. రైతులు సాగు చేసిన కూరగాయలు మార్కెటింగ్‌తో పాటు నిల్వ ఉంచుకునే సదుపాయంఉందన్నారు. మహిళలు తయారు చేసినవన్నీ డిమార్టు ద్వారా అమ్మకాలు జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మహిళల్లో ఉండే నైపుణ్యాలను గుర్తించి వారి అభివృద్ధికి నాబార్డు కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ పి.సీతారామయ్య, నాబార్డు ప్రతినిధి నేచురల్ హెల్త్ కేర్ సొసైటీ సభ్యులు నూకతోటి భగవాన్‌దాస్, సీసీలు రమాదేవి, బేబిరాణి, శిక్షణ బోధకురాలు జి.లక్ష్మీప్రభావతి పాల్గొన్నారు.
నాబార్డు డీడీఎం కార్తీక్