
సుభాని నగర్‌లోని మస్జీదే ఎ సుభహానిలో జుమ్మ నమాజ్‌లో బయాన్ చేస్తున్న మౌలానా కలీమ్
యడ్లపాడు: పవిత్ర రంజాన్ మాసం ఉపవాస దీక్షలు(రోజా) శుక్రవారం నుంచి ముస్లింలు ప్రారంభించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో గురువారం సాయంత్రం నెలవంక దర్శనం కావడంతో ముస్లింలు ఎంతో సంతోషంగా దువా చేసి దీక్షలు చేపట్టేందుకు సిద్ధం అయ్యారు. అదేరోజు రాత్రి రంజాన్ మాసానికే ప్రత్యేకమైన తరావీహ్ నమాజ్‌లను అన్ని మసీదుల్లో చదవడం ప్రారంభించారు. దీంతో రాత్రి 8.30 నుంచి 10.30 గంటల వరకు అన్నీ మసీదుల్లో మతపెద్దల బయాన్‌లు, తరావీహ్ నమాజ్‌లు కొనసాగాయి. ఏ మసీదులో చూసిన దీక్షలు చేపట్టే వారే కాకుండా అనారోగ్యం ఇతర కారణాలతో దీక్షలు చేపట్టిన వారు కూడా నూతన వస్త్రాలు ధరించి తరావీహ్ నమాజ్‌కు హాజరయ్యారు. రంజాన్ మాసం తొలిరోజున మసీదులన్నీ భక్తులతో కిటకిటలాడాయి. నమాజ్ అనంతరం ఖర్జూరం, స్వీట్లను దాతలు మసీదుల్లో పంపిణీ చేస్తూ రంజాన్ మాసం ప్రారంభ శుభాకాంక్షలు తెలిపారు.
సుదినం.. పవిత్రమాసం రెండు ఒకేసారి
ముస్లింలు పండుగ రోజుగా భావించే శుక్రవారం నాడే పవిత్ర రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం కావడంతో అంతటా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం ఉపవాస దీక్షలు ఆరంభించి మధాహ్నం జుమ్మా (శుక్రవారం) ప్రత్యేక ప్రార్థనకు హాజరయ్యారు. పవిత్ర దినం, పవిత్ర మాసం ఒకేరోజు ప్రారంభం కావడం.. వాటియొక్క విశిష్టతలను మతపెద్దలు జుమ్మ బయాన్‌లో వివరించారు. రంజాన్ మాసంలో రోజా ఎంతముఖ్యమో చెడు పనులకు, చెడు ఆలోచనకులు దూరంగా ఉండటం అంతకంటే ముఖ్యమని బోధించారు.
ఉపవాస దీక్షాధారులతో నిండిన మసీదులు గురువారం రాత్రి నుంచే తరావీహ్ నమాజులు