
ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న జేసీ శ్యాంప్రసాద్
కారెంపూడి: కారెంపూడిలో మరుగుదొడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ.శ్యాంప్రసాద్ ఆదేశించారు. గ్రామాభ్యుదయం ప్రోగ్రాంలో భాగంగా తండాలో శుక్రవారం తెల్లవారుజామున పర్యటించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తండాలో 80 నివాస గృహాలుంటే అందులో సగం ఇళ్లకు మరుగుదొడ్లు లేవనే విషయాన్ని గుర్తించి అక్కడికక్కడే పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఫోన్‌లోనే ఆదేశాలిచ్చారు. ప్రభుత్వం రూ.12,500 సాయం అందిస్తుందని లబ్ధిదారులు ప్రతి ఇంటికి మరుగుదొడ్లు నిర్మించుకోవాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాన్ని దర్శించి గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని మెనూ ప్రకారం అందిస్తున్నారా లేదా అనే విషయాన్ని పరిశీలించారు. రక్త హీనతతో బాధపడుతూ బరువు తక్కువగా ఉన్న పిల్లల వివరాలు అడిగి తెలుసుకుని తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వృద్ధులను పలకరించి వారి ఆరోగ్య పరిస్థితిని వారు తింటున్న ఆహారం వారు చేస్తున్న పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కల్తీలేని కెమికల్ రహిత ఆహారాన్ని అందరూ స్వీకరించాలని జేసీ సూచించారు. ఫ్యామిలీ ఫిజీషియన్ ప్రోగ్రాం గురించి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు గ్రామంలో పర్యటించారు. ఆయన వెంట తహసీల్దార్ జి.శ్రీనివాస్‌యాదవ్, ఎంపీడీఓ జి.శ్రీనివాసరెడ్డి, సర్పంచి తేజానాయక్, ఎంపీపీ శ్రీనివాసరెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు షఫీ, ఎంపీటీసీ లింగయ్య ఉన్నారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్ కారెంపూడి తండాలో పర్యటన