ఆలయాల అభివృద్ధికి దాతలు రావడం అభినందనీయం | - | Sakshi
Sakshi News home page

ఆలయాల అభివృద్ధికి దాతలు రావడం అభినందనీయం

Mar 25 2023 2:08 AM | Updated on Mar 25 2023 2:08 AM

- - Sakshi

కాజ(మంగళగిరి): ప్రాచీన ఆలయాల అభివృద్ధికి దాతలు ముందుకు రావడం అభినందనీయమని టీటీడీ ట్రస్ట్‌ బోర్డ్డు చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి కొనియాడారు. నగర పరిధిలోని కాజలోని కోదండ రామాలయం, అగస్తేశ్వర స్వామి ఆలయాల విమాన శిఖర ప్రతిష్టా మహోత్సవానికి శుక్రవారం ముఖ్య అతిఽథిగా విచ్చేసిన వైవీ సుబ్బారెడ్డి స్వామి వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రాచీన ఆలయాల జీర్ణోద్ధారణకు దాతలు సింహాద్రి వెంకట రామారెడ్డి దంపతులు పూనుకోవడం ప్రశంసనీయమన్నారు. ప్రాచీన ఆలయాల అభివృద్ధిలో భాగంగా టీటీడీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని మరిన్ని ఆలయాలను అభివృద్ధి పరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అందులో భాగంగా కాజ ఆలయాలకు తమ వంతు సహాయ సహకారాలను అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం స్వామి వారికి విశేష పూజలు నిర్వహించి విమాన శిఖర ప్రతిష్ట, జీవకళాన్యాసం, మహాకుంభాభిషేకం, పూర్ణాహుతి, శాంతి కల్యాణం నిర్వహించారు. పూజల్లో ఆప్కో ౖచైర్మన్‌ గంజి చిరంజీవి, సింహాద్రి వెంకట రంగారెడ్డి దంపతులు, ఆర్ల రామయ్య, కమ్మెల సుబ్బారావు, మార్కెట్‌యార్డు మాజీ వైస్‌ చైర్మన్‌ అన్నపురెడ్డి బ్రహ్మార్గనరెడ్డి పాల్గొన్నారు. భక్తులకు అన్న ప్రసాదం వితరణ చేశారు.

నూతన అంశాలు వెలుగులోకి రావాలి

వీసీ ఆచార్య రాజశేఖర్‌

ఏఎన్‌యూ: తెలుగు భాషా విభాగం ఆధ్వర్యంలో పరిశోధనలు, సదస్సుల ద్వారా తెలుగు సాహిత్యం, కవులు, రచయితలకు సంబంధించిన నూతన అంశాలు వెలుగులోకి తేవాలని వీసీ ఆచార్య పి.రాజశేఖర్‌ అన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ తెలుగు, ప్రాచ్య భాషా విభాగం ఆధ్వర్యంలో ‘ అనిశెట్టి– పినిశెట్టి సాహిత్యం– సామాజిక దృక్కోణం ‘ అనే అంశంపై రెండు రోజులపాటు నిర్వహిస్తున్న జాతీయ సదస్సును శుక్రవారం ప్రారంభించారు. వీసీ ప్రసంగిస్తూ తెలుగు సాహిత్యం ద్వారా సామాజికంగా ఎంతో మార్పుకు కృషి చేసిన అనిశెట్టి– పినిశెట్టిలకు సంబంధించిన అంశాలపై సదస్సు నిర్వహించడం వలన వారి భావజాలాన్ని సమాజానికి మరింత చేరువ చేసినట్లవుతుందన్నారు. వారి సాహిత్య విలువలపై ఈ సదస్సులో కూలంకుషంగా చర్చించాలన్నారు. ఏఎన్‌యూ రెక్టార్‌ పి.వరప్రసాద్‌ మూర్తి ప్రసంగిస్తూ సామాజిక అంశాలు, విలువల కోసం నిరంతరం కృషి చేసిన మహనీయులపై జాతీయస్థాయిలో చర్చ జరగడం అభినందనీయమని చెప్పారు. వర్సిటీ ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ సీహెచ్‌ స్వరూప రాణి మాట్లాడుతూ సమాజానికి వీరి నాటకాలు, సినిమాలు, వాటిలోని పాత్రల సృష్టి ద్వారా ఉన్నత విలువల్ని అనిశెట్టి సుబ్బారావు, పినిశెట్టి శ్రీరామమూర్తి సమాజానికి అందించారన్నారు. పినిశెట్టిపై కీలక ప్రసంగం చేసిన మద్రాస్‌ యూనివర్సిటీ తెలుగు విభాగాధిపతి విస్తాలి శంకరరావు మాట్లాడుతూ నాటి నాటక, సినీ రచనలు, వాటి పాత్ర చిత్రాల్లోనూ నైతికత ప్రధానంగా ఉండేదని వివరించారు. కానీ నేడు అది లోపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పినిశెట్టి ఆనాడే సమాజానికి మంచి విలువలతో కూడిన సాహిత్యాన్ని అందించారని అన్నారు. అనిశెట్టిపై పి.వి.సుబ్బారావు కీలక ఉపన్యాసం చేస్తూ నాటక, సినీ రచనల్లో ఎంతో వైవిధ్యం ఉందన్నారు. అనిశెట్టి కుమారుడు, విశ్రాంత ఆంగ్ల అధ్యాపకుడు శాంత కుమార్‌ ప్రసంగిస్తూ తన తండ్రిలో ఎంతో ఉన్నత విలువలు ఉన్నాయని అవి తాను స్వయంగా చూశానన్నారు. సదస్సులో డైరెక్టర్‌ ఆచార్య కృష్ణారావు, తెలుగు విభాగాధిపతి డాక్టర్‌ మాధవి ప్రసంగించారు.

1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement