విద్యార్థులపై మాల్‌ ప్రాక్టీసు కేసులు

హిందూ కళాశాలలో పరిశీలిస్తున్న 
జిల్లా కలెక్టర్‌ వేణుగోపాల్‌ రెడ్డి  - Sakshi

గుంటూరు ఎడ్యుకేషన్‌: జేబులో స్లిప్పులు పెట్టుకుని ఇంటర్‌ పరీక్షలు రాసేందుకు వచ్చిన ఐదుగురు విద్యార్థులపై అధికారులు మాల్‌ ప్రాక్టీసు కేసులు నమోదు చేశారు. గురువారం జూనియర్‌ ఇంటర్‌ విద్యార్థులకు మ్యాథ్స్‌ 1బీ, జువాలజీ, హిస్టరీ పేపర్‌–1 పరీక్షలు జరిగాయి. గుంటూరు అమరావతిరోడ్డులోని నారాయణ జూనియర్‌ కళాశాలలో మ్యాథ్స్‌ 1బీ పరీక్ష రాస్తూ కాపీయింగ్‌కు పాల్పడుతున్న ముగ్గురు విద్యార్థులతో పాటు గోరంట్లలోని శ్రీచైతన్య, చిలకలూరిపేటలోని ఏఎంజీ జూనియర్‌ కళాశాలల్లో మరో ఇద్దరిని చీఫ్‌ సూపరింటెండెంట్‌, ఇన్విజిలేటర్లు గుర్తించారు. కాపీయింగ్‌కు పాల్పడుతున్న వీరిపై మాల్‌ ప్రాక్టీసు కేసులు నమోదు చేసిన అధికారులు పరీక్షల నుంచి డీబార్‌ చేశారు. గురువారం జరిగిన పరీక్షలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 134 కేంద్రాల పరిధిలో కేటాయించిన 46,763 మంది విద్యార్థుల్లో 45,614 మంది హాజరయ్యారు. 84 పరీక్ష కేంద్రాల్లో అధికారులు, ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌ విస్తృత తనిఖీలు నిర్వహించారు.

పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్‌..

మార్కెట్‌ సెంటర్లోని హిందూ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి తనిఖీ చేశారు. మాల్‌ ప్రాక్టీసులు జరగకుండా విద్యార్థులను ప్రతిరోజూ క్షుణ్ణంగా తనిఖీ చేసి, కేంద్రాల్లోకి అనుమతించాలని విధుల్లో ఉన్న సీఎస్‌, డీఓలతో పాటు ఇన్విజిలేటర్లను ఆదేశించారు. కలెక్టర్‌ వెంట ఆర్‌ఐఓ జి. సునీత, చీఫ్‌ సూపరింటెండెంట్‌ వెంకట రాము, డీఓ రత్నశేఖర్‌, కస్టోడియన్‌ ఆర్‌.మరియదాసు, తహసీల్దార్‌ సాంబశివరావు, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ పీఎం ప్రసాద్‌ ఉన్నారు.

స్లిప్పులతో వచ్చిన ఐదుగురు ఇంటర్‌ విద్యార్థులు డీబార్‌ గుంటూరులో పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్‌

Read latest Palnadu News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top