
● జగన్మాతకు పుష్పాభిషేకం
విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న వసంత నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గురువారం దుర్గమ్మకు ఎర్రగులాబీలు, కనకాంబరాలతో అర్చన చేశారు. లక్ష్మీ గణపతి విగ్రహం వద్ద ప్రతిష్టించిన దుర్గమ్మ ఉత్సవ మూర్తికి ఈ పుష్పాలతో అర్చన నిర్వహించారు. అమ్మవారికి జరుగుతున్న విశేష పుష్పార్చనను వీక్షించేందుకు పెద్ద ఎత్తున భక్తులు వేదిక వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఆశీర్వచనం అందజేసిన అర్చకులు వారికి పుష్పాలను బహూకరించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్ విజయవాడ
నరసరావుపేట: జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలయ్యేలా సంబంధిత అధికారులంతా కృషి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్‌లోని ఎస్.ఆర్.శంకరన్ వీడియో కాన్ఫరెన్సు హాలు నుంచి ఆన్‌లైన్ ద్వారా సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా జగనన్న భుహక్కు, భూ రక్ష పథకం ద్వారా జరుగుతున్న రీ–సర్వే పనులు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. భూ హక్కుల స్వచ్ఛీకరణ (ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్), భూ హక్కు పత్రాల పంపిణీ, సర్వే కొలతల దరఖాస్తుల పరిశీలన – పరిష్కారం, వ్యవసాయ భూముల పంపిణీ, వన్ టైం కన్వర్షన్ పనులు వందశాతం పూర్తి చేయాలన్నారు. రీ–సర్వేకు సంబంధించిన దరఖాస్తులను వెంటనే పరిష్కారం చుపాలన్నారు. జిల్లాలో పలుచోట్ల లంక భూములు ఉన్నాయని వాటిపై వెంటనే విచారణ నిర్వహించి అర్హత కల్గినవారికి పట్టాలు మంజూరు చెయ్యాలన్నారు. ప్రభుత్వ భూముల్లో వ్యవసాయానికి అనుకూలంగా ఉన్నవాటిని గుర్తించి అర్హత కలిగిన రైతులకు పట్టాలు మంజూరు చేయ్యాలన్నారు. సాదా బైనామా భూముల అగ్రిమెంట్‌పై కొనసాగుతున్న భూములను పరిశీలన చేసి వారికి హక్కు కల్పిస్తూ రిజిస్ట్రేషన్ త్వరితంగా చేసేందుకు కృషి చేయాలని ఆదేశించారు. ఇందుకోసం వారం రోజులు సమయం తీసుకోవాలని సూచించారు. సివిల్ సప్లయ్ విభాగంలో ఇటీవల ఒకే కుటుంబానికి రెండు రేషన్ కార్డులు ఉన్నట్లు గుర్తించడం జరగిందని, వాటిపై సకాలంలో విచారణ నిర్వహించి వారికి అవసరమైన ఒక్క రేషన్ కార్డ్‌ను ఉంచి మిగతా కార్డును తొలిగించాలన్నారు. రేషన్ పంపిణీలో అక్రమాలు జరగకుండా సక్రమ రేషన్ పంపిణీ జరిగేలా రేషన్ పంపిణీ వాహన దారులకు అవగాహన కల్పించాలని జేసీ సూచించారు. సమావేశంలో జిల్లా సివిల్ సప్లయీస్ అధికారి, ఏడీ సర్వే విభాగం అధికారి, కలెక్టరేట్ కార్యాలయం అధికారులు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, మండల సర్వేయర్లు పాల్గొన్నారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్

అధికారులతో మాట్లాడుతున్న జేసీ ఎ.శ్యామ్‌ప్రసాద్