నరసరావుపేట: జిల్లాలో క్షయవ్యాధి (టీబీ) అంతానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని లెప్రసీ, టీబీ, ఎయిడ్స్ జిల్లా అధికారి డాక్టర్ కె.పద్మావతి గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మార్చి 24వ తేదీన ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా అవును మనం టీబీని అంతం చేయొచ్చనే నినాదంతో ప్రధానమంత్రి టీబీ ముక్తభారత్ అభియాన్ కింద 2025నాటికి టీబీని అంతం చేయటం అనే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ కృషిచేయాలని అన్నారు. టీబీ వ్యాధి మైకో ట్యూబర్‌కులోసిస్ అనే బాక్టీరియా ద్వారా వస్తుందన్నారు. రెండు వారాలకు మించి దగ్గు, కళ్లె పడటం, రాత్రిపూట జ్వరం, చెమటలు పట్టడం, బరువు తగ్గి ఆకలి లేకపోవటం, దగ్గినప్పుడు కళ్లెలో రక్తపుచారలు పడటం దీని లక్షణమన్నారు. దీనికి చికిత్స తీసుకోకపోతే ఆ రోగి తుమ్మినా, దగ్గినా తుంపర్ల ద్వారా మరొకరికి వ్యాధి సంక్రమిస్తుందన్నారు. ఇటువంటి లక్షణాలు ఉంటే దగ్గరలోని చికిత్సాకేంద్రంలో టీబీ నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలన్నారు. సరైన సమయంలో చికిత్స తీసుకుంటే వ్యాధి నయమౌతుందన్నారు. టీబీ వ్యాధిగ్రస్తుల వివరాలు నిక్షయ యాప్‌లో పొందుపర్చి వారిని గుర్తించి మందులు అందజేయబడతాయన్నారు. ఇంటింటి సర్వే ద్వారా రోగ గ్రస్తులను కనుకొని కళ్లె పరీక్ష, ట్రునాట్, సీబీనాట్ పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారించి మందులు ఉచితంగా అందజేయబడతాయన్నారు. వ్యాధి నిరోధకశక్తి పెంపొందించేందుకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లాలో 600మందికి నిక్షయమిత్ర డోనర్ల ద్వారా పౌష్టికాహారం ఉచితంగా అందజేస్తున్నామన్నారు. వ్యాధిగ్రస్తులు మందులతోపాటు పౌష్టికాహారం తీసుకొని ఇతరులకు వ్యాధి సంక్రమించకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
జిల్లా అధికారి డాక్టర్ కె.పద్మావతి