
రోడ్డుకు అడ్డుగా పడిపోయిన చెట్టు
రొంపిచర్ల: ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం గురువారం మండలంలో బీభత్సం సృష్టించింది. మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడి మేఘావృతమై చిరుజల్లులు ప్రారంభమయ్యాయి. ఒక్కసారిగా ఈదురు గాలులు బలంగా వీయటంతోపాటు ఉరుములు, మెరుపులు రావటంతో ప్రజలు భయాందోళన చెందారు. మండలంలోని మునమాక, విప్పర్లపల్లి గ్రామాల మధ్య రోడ్డుకు ఇరువైపుల ఉన్న చెట్లు నేలకూలాయి. దీంతో ఇరు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామ సమీపంలోని పొలాల్లో ధాన్యపు రాశులకు పట్టలు కప్పేందుకు వెళ్లిన షేక్ కరీంసా, షేక్ జాన్‌సైదులు సమీప ప్రాంతంలో పిడిగులు పడటంతో షాక్‌కు గురై ఇరువురికి గాయాలయ్యాయి. స్కూల్ బస్సులు నరసరావుపేట నుంచి విప్పర్లపల్లి, వడ్లమూడివారిపాలెం, తురిమెళ్ల, అలవాల, అచ్చయ్యపాలెం, సుబ్బయ్యపాలెం వెళ్లే గ్రామాల ప్రయాణికులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్డుకు ఇరువైపుల ఉన్న చెట్లు కూలడంతో వాహనాలు నిలిచిపోగా, విద్యార్థులు, ప్రయాణికులు పడిపోయిన చెట్ల కిందగా అతి కష్టంపై వెళ్లాల్సి వచ్చింది. సాయంత్రం వరకు ఈ రహదారిలో చెట్లు తొలగింపు జరగలేదు. ఈదురుగాలులకు రేకుల ఇళ్లు లేచిపోయాయి. పొలంలో ఉన్న మొక్కజొన్న పైరు కూడా పూర్తిగా నేలకొరిగింది. విద్యుత్ సౌకర్యం నిలిచిపోయింది.
విరిగిపడిన చెట్లు
పిడుగుపాటుకు ఇద్దరికి గాయాలు