
విచారణ చేస్తున్న జిల్లా ఉన్నతాధికారులు
పెదగొట్టిపాడు (ప్రత్తిపాడు): సాంఘిక బహిష్కరణ ఫిర్యాదుపై జిల్లా ఉన్నతాధికారులు గొట్టిపాడులో బహిరంగ విచారణ చేపట్టారు. 2018 జనవరిలో ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడులో నూతన సంవత్సర సంబరాల సమయంలో దళితులు, అగ్రవర్ణాలకు మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో జనవరి నుంచి ఆగస్టు వరకు తమను సాంఘిక బహిష్కరణ చేశారంటూ 2022లో స్థానిక దళితవాడ మహిళలు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల కోర్టు ఆదేశాల మేరకు గ్రామంలోని అగ్రవర్ణాలకు చెందిన కొందరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. సాంఘిక బహిష్కరణపై విచారణ జరిపేందుకు డీఆర్‌డీఏ పీడీ, సోషల్ వెల్ఫేర్ డీడీ, ఆర్డీవోలతో జిల్లా కలెక్టర్ ఒక కమిటీని నియమించారు. ఈ నేపథ్యంలో గురువారం డీఆర్‌డీఏ పీడీ హరిహరనాథ్, సోషల్ వెల్ఫేర్ డీడీ మధుసూదనరావు, గుంటూరు ఆర్డీవో ప్రభాకర్ రెడ్డిలు స్థానిక ఎస్సీ కాలనీలో బహిరంగ విచారణ జరిపారు. ఫిర్యాదుదారులతో పాటు మహిళలతో వారు మాట్లాడారు. సాంఘిక బహిష్కరణపై మహిళలను అడిగి తెలుసుకున్నారు. కొందరు మహిళలు తమను పొలం పనులకు పిలవలేదని, నిత్యావసర సరుకులు ఇవ్వలేదని, బావులు, మంచినీటి చెరువుల వద్దకు రానివ్వలేదని అధికారులకు వివరించారు. వెంట తహసీల్దార్ సంజీవకుమారి, ఏపీఎం సురేష్ కుమార్ తదితరులున్నారు.