
మాట్లాడుతున్న జిల్లా వ్యవసాయ అధికారి ఐ.మురళి, చిత్రంలో వెంకట్రావు, అమలకుమారి
జిల్లా వ్యవసాయ అధికారి ఐ.మురళి
నరసరావుపేటరూరల్: ప్రకృతి వ్యవసాయం ద్వారా భూసారాన్ని కాపాడుకోవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి ఐ.మురళి అన్నారు. పట్టణంలోని కెఆర్ జూనియర్ కళాశాల ఆవరణలో ప్రకృతి వ్యవసాయంపై సమీక్షా సమావేశం గురువారం నిర్వహించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి మురళి, రైతు సాధికార సంస్థ రాష్ట్ర కార్యాలయం రీజనల్ కోఆర్టినేటర్ ఎన్.వెంకట్రావు, ప్రాజెక్ట్ మేనేజర్ కె.అమలకుమారి, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి మురళి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంతోపాటు, రసాయన వ్యవసాయం చేస్తున్న రైతుల పంట భూములు ఖాళీగా ఉన్న సమయంలో మట్టి నమూనాలు సేకరించాలని తెలిపారు. భూసార పరీక్ష చేయడంతో భూమిలో కర్బన శాతం ఎంత ఉంది, ఎంత మోతాదులో పోషకాలు ఉన్నాయో తెలుస్తుందన్నారు. దీని ద్వారా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న పొలాల్లో భూసారం ఏవిధంగా పెరుగుతుందో అర్ధమవుతుందని తెలిపారు. పియండిఎస్ విత్తనాలు అన్ని రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. రైతు సాధికారిక సంస్థ రీజనల్ కోఆర్టినేటర్ వెంకట్రావు మాట్లాడుతూ ప్రస్తుతం పంటలు తీసి ఖాళీగా ఉన్న పొలాల్లో 30 రకాల విత్తనాలు, బీజామృతం, బంకమన్ను, ఘన జీవామృతంతో విత్తన శుద్దిచేసి, విత్తనాలు గుళికలుగా తయారుచేసి పొలాల్లో వేసుకోవాలని సూచించారు. ఈ విధానం ద్వారా విత్తనాలకు చీడపీడలు ఆశించకుండా మొక్కలు ఆరోగ్యంగా వస్తాయని తెలిపారు. డీపీఎం కె.అమలకుమారి మాట్లాడుతూ ఇప్పటి వరకు 207మంది రైతులు విత్తన గుళికలు తయారుచేసి పొలాల్లో వేసుకోవడం జరిగిందన్నారు. రెండురోజులుగా కురుస్తున్న వర్షాలకు మొలకలు వచ్చాయని వివరించారు. వర్షాలను ఉపయోగించుకుని 30 రకాల విత్తనాలు వేయడం ద్వారా 365 రోజులు భూమిలో పంట ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీని ద్వారా సూక్ష్మజీవులు వృద్ధి చెంది భూసారం పెరుగుతుందని తెలిపారు.