
పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న జిల్లా కలెక్టర్, పశుసంవర్ధకశాఖ అధికారులు
● జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్ ● టీకాల కార్యక్రమంపై పోస్టర్ ఆవిష్కరణ
నరసరావుపేట: జిల్లాలోని రైతులందరూ తమ పశువులకు ప్రభుత్వం ఉచితంగా అందజేసే గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌లో పశుసంవర్ధకశాఖ అధికారులతో కలిసి గాలికుంటు వ్యాధి నివారణ నిమిత్తం జిల్లాకు ప్రభుత్వం కేటాయించిన టీకాలు, లాజిస్టిక్స్, పోస్టర్లను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో 4,35,950 పశువులకు ఉచితంగా గాలికుంటువ్యాధి నివారణ కోసం టీకాల కార్యక్రమం ఈనెల 25వ తేదీ నుంచి ఏప్రిల్ 24వ తేదీ వరకు నెలరోజుల పాటు నిర్వహించబడుతున్న కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి డాక్టర్ కె.కాంతారావు మాట్లాడుతూ వ్యాధి సోకిన పశువులకు 106 డిగ్రీల జ్వరం, నోరు, కాలిగిట్టల మధ్య పుండ్లు, నోటి నుంచి తీగెల మాదిరి చొంగ కారుతుండటం లక్షణాలన్నారు. దీని వలన ఎద్దులు, దున్నపోతుల్లో పని సామర్ధ్యం తగ్గుతుందని, పాడి పశువుల్లో పాలదిగుబడి గణనీయంగా తగ్గిపోతుందన్నారు. లేగదూడల్లో మరణాల సంఖ్య అధికంగా ఉంటుందన్నారు. చూడి పశువుల్లో గర్భస్రావాలు సంభవిస్తాయన్నారు. కావున నాలుగు నెలలు నిండిన ప్రతి పశువుకు తప్పనిసరిగా టీకాలు వేయించాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డీఆర్వో కె.వినాయకం, పశుసంవర్ధకశాఖ ఉపసంచాలకులు డాక్టర్ ఎన్‌సీహెచ్.నరసింహాలు, పశువ్యాధి నిర్ధారణ ప్రయోగశాల సహాయ సంచాలకులు డాక్టర్ ఎస్.కళావతి, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు డాక్టర్ వి.శ్రీధర్, డాక్టర్ కరుణాకరరెడ్డి, డాక్టర్ బీవీ లక్ష్మి పాల్గొన్నారు.