
● ఉన్నత విద్యా బోధనలో ఆలోచనా విధానం మారాలి ● విద్యార్థుల సమర్థతలను అధ్యాపకులు అంగీకరించడం లేదు ● అధ్యాపకులు విజ్ఞానాన్ని, సానుకూల దృక్ఫథాన్ని అలవరచుకోవాలి ● బోధనకంటే అనవసర అంశాలకే ఎక్కువ మంది ప్రాధాన్యత ఇస్తున్నారు ● జాతీయ సదస్సు ప్రారంభోత్సవ సభలో వీసీ
ఏఎన్‌యూ: ఉన్నత విద్యలో చాలా మంది అధ్యాపకుల బోధనలో విషయ పరిజ్ఞాన లోపం ఉంటోందని వీసీ ఆచార్య పి రాజశేఖర్ అన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎడ్యుకేషన్ విభాగం ఆధ్వర్యంలో ‘ పర్‌స్పెక్టివ్స్ అండ్ చాలెంజెస్ ఫర్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్’ అనే అంశంపై రెండు రోజులపాటు నిర్వహిస్తున్న జాతీయ సదస్సును గురువారం వీసీ ప్రారంభించారు. ఆయన ప్రసంగిస్తూ ఉన్నత విద్యా బోధకుల ఆలోచన విధానం మారితే తప్ప ఈ రంగంలో ఆశించిన ఫలితాలు సాధించలేమన్నారు. ఉన్నత విద్యలో విద్యార్థులు, యువకుల్లో అనేక అంశాల్లో పరిజ్ఞానం ఉంటుందని కానీ దానిని చాలా మంది అధ్యాపకులు కనీసం అంగీకరించే పరిస్థితి లేదన్నారు. కేంద్రియ విశ్వవిద్యాలయాలు, ఐఐటీలలో అధ్యాపకుడు, విద్యార్థి ఎంతో సన్నిహితంగా ఉంటారని, విద్యార్థి వ్యక్తంచేసిన నూతన అంశాలు, విషయ పరిజ్ఞానంపై అధ్యాపకుడు అతనితో కలిసి సుదీర్ఘంగా చర్చించే పరిస్థితి ఉందన్నారు. అవసరం అనుకుంటే విద్యార్థి ఆలోచన, నూతన అంశాలను అధ్యాపకుడు తన పుస్తకంలో పొందుపరచుకునే పరిస్థితి కూడా ఉందన్నారు. అందుకే అక్కడి విద్యార్థులు ఎంతో నైపుణ్యవంతులు అవుతున్నారన్నారు. కానీ రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థలలో పూర్తిగా దానికి భిన్నమైన పరిస్థితులు మనం చూస్తున్నామని చెప్పారు. చాలా మంది అధ్యాపకులు తాము బోధించాల్సిన విషయాల కంటే అనవసరమైన అంశాలకే అధిక ప్రాధాన్యమిస్తున్నారని తెలిపారు. అధ్యాపకులు సానుకూల ధృక్పధాన్ని, పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విజ్ఞానమే అధ్యాపకుడి సద్భావనను తెలియజేస్తుందన్నారు. కఠోర శ్రమ, విజ్ఞానం పెంపొందించుకోవడం, నూతన అంశాల అధ్యయనం వంటి అంశాలు విద్యార్థిని ఉన్నతు డిగా తీర్చిదిద్దుతాయన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ విభాగాధిపతి ఆచార్య ఏ రామకృష్ణ కీలకోపన్యాసం చేస్తూ విద్యార్థులు, యువత సరైన నిర్ణయాలు తీసుకోకపోతే ఆ సమాజం పరిపూర్ణతను సాధించలేదన్నారు. విద్యార్థులు నిర్ణయాత్మక శక్తిగా ఎదిగే విధంగా ఉన్నత విద్యలో అధ్యాపకులు వారిని ప్రోత్సహించాలని అభిప్రాయపడ్డారు. సదస్సు డైరెక్టర్ ఆచార్య పి.బ్రహ్మాజీరావు అధ్యక్షోపన్యాసం చేస్తూ రెండు రోజులపాటు జరిగే సదస్సులో దేశ వ్యాప్తంగా 65 మంది పరిశోధనాపత్రాలు సమర్పించను న్నారని తెలిపారు. బీహార్ మౌలానా అజా ద్ సెంట్రల్ యూనివర్సిటీ అధ్యాపకులు ఆచార్య పి ఆడంపాల్, కేరళ మహాత్మాగాంధీ యూనివర్సిటీ అధ్యాపకులు ఆచార్య ఇస్మాయిల్ థామరాస్సెరి, ఏఎన్‌యూ ఎడ్యుకేషన్ బీఓఎస్ చైర్‌పర్సన్ డాక్టర్ జేఆర్ ప్రియదర్శిని ప్రసంగించారు.