జయపురం: స్థానిక విక్రమదేవ్ విశ్వవిద్యాలయ కులపతిగా ప్రొఫెసర్ డాక్టర్ హృషికేష్ శనాపతి బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత కులపతి ప్రొఫెసర్ డాక్టర్ దేవీ ప్రసాద్ మిశ్రా నూతన కులపతికి బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా నూతన కులపతి డాక్టర్ హృషికేష్ శనాపతి మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయ సర్వాంగ ఉన్నతికి తాను కట్టుబడి ఉంటానని తెలిపారు. విశ్వవిద్యాలయంలో విద్యా ప్రమాణాలు పెంచేందుకు, విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించటం తన ప్రధాన లక్ష్యమన్నారు. కొత్త కులపతికి విశ్వ విద్యాలయంలో ఘన స్వాగతం లభించింది. ఆయనకు కులపతి దేవీ ప్రసాద్ మిశ్రతో పాటు రిజిస్ట్రార్ మహేశ్వర్ చంద్ర నాయక్, యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి రంజన్ కుమార్ ప్రధాన్, పీజీ కౌన్సిల్ అధ్యక్షుడు డాక్టర్ ప్రశాంత్ కుమార్ పాత్రో, విక్రమదేవ్ కళాశాల ప్రిన్సిపాల్ కెప్టెన్ డాక్టర్ లక్ష్మణ పాత్రో, అధ్యాపకులు, ఉద్యోగులు ఘనంగా స్వాగతించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ డాక్టర్ దేవీ ప్రసాద్ మిశ్రాకు ఘనంగా వీడ్కోలు పలికారు. వీడ్కోలు సభకు రిజిస్ట్రార్ మహేశ్వర చంద్ర నాయక్ అధ్యక్షతన జరిగింది. వీడ్కోలు సభలో వర్సిటీ విద్యార్థులు పాల్గొన్నారు.


