శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): పశ్చిమాసియాలో గత కొద్దిరోజుల నుంచి అమెరికా, ఇజ్రాయిల్‌లు ఇరాన్‌పై ఉమ్మడిగా చేస్తున్న యుద్ధాన్ని ఆపాలని పౌర హక్కుల సంఘం నేతలు కోరారు. ఈ మేరకు ప్రపంచ శాంతిని కోరుతూ శ్రీకాకుళం జిల్లా పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని శ్రీకాకుళంలోని ఎన్జీవో హోమ్‌లో ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి పత్రి దానేష్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేవీ జగన్నాథరావు, అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నంశెట్టి రాజశేఖర్, కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిస్కా కృష్ణయ్య, పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దిల వినోద్ కుమార్, సీపీఐ లిబరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యుడు మద్దిల రామారావు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి సీహెచ్ అమ్మన్నాయుడు, దేశభక్తి ప్రజాతంత్ర ఉద్యమం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరావులు మాట్లాడుతూ.. మానవజాతి మనుగడకు ప్రమాదకరమైనటువంటి యుద్ధాన్ని వెంటనే నిలిపివేయాలని కోరారు. ఇరాన్‌పై చేస్తున్న యుద్ధాన్ని తీవ్రంగా ఖండించారు. యుద్ధం వల్ల అనేక దేశాలు ఆర్థిక సంక్షోభాలు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కృత్రిమ యుద్ధాలను సృష్టించి తన ఆయుధ సంపదను అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్న అమెరికా కుటీల బుద్ధిని, వ్యాపార విధానాన్ని వ్యతిరేకించారు. చర్చలు ద్వారా రెండు దేశాలు తమ సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో స్వేచ్ఛ మహిళా సంఘం నాయకులు నాగమణి, భానుమతి, నాయకులు గీతారాణి, జోగారావు, దానయ్య, వైకుంఠరావు తదితరులు పాల్గొన్నారు.


