కొరాపుట్: చెరువులో మునిగి ముగ్గురు బాలికలు మృతి చెందారు. గురువారం నబరంగ్‌పూర్ జిల్లా ఉమ్మర్‌కోట్ సమితి కుర్సి గ్రామ పంచాయతీ ఉప్పరపొడ గ్రామంలో రాజ్ మాన్ గొండో ఇద్దరు కుమార్తెలు ఆధార్ గొండొ (6), సంజితా గొండొ (5), బాల్ సాయి గొండొ కుమార్తే ఫలాల్ గొండొ (7)లు మృతి చెందారు. వీరంతా సమీప ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి చదువుతున్నారు. ఉదయం 11 గంటలకు స్కూల్ నుంచి ఇంటికి వచ్చారు. అనంతరం సమీప చెరువులో స్నానానికి వెళ్లి మునిగిపోయారు. గమనించిన మిగతా పిల్లలు ఇళ్లకు వెళ్లి పెద్దలకు చెప్పారు. వారు వచ్చి నీటి నుంచి వెలికి తీసి సమీప ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే వీరు మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మృతులంతా బంధువులు కావడంతో గ్రామం రోదనలతో మునిగి పోయింది.


