రాయగడ: అందరి కృషితోనే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమవుతుందని ఝార్సుగుడ ఎస్పీ గుండాలరెడ్డి రాఘవేంద్ర అన్నారు. మంగళవారం ఝార్సుగుడలో గల మేఫెయర్ ఒయాసీస్ ప్రాంగణంలో ఇండియన్ మెడికల్ అసొసియేషన్ సంస్థ ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఆరోగ్యకరమైన సమాజం ఏర్పాటైతే శాంతియుత వాతావరణం వస్తుందన్నారు. నేటి యువత మాదక ద్రవ్యాలకు బానిసై తమ భవిష్యత్‌ను బుగ్గిపాలు చేసుకుంటున్నారని అన్నారు. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సును ఏకీకృతం చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్య సిద్ధిస్తుందన్నారు. పెరుగుతున్న ఆధునిక టెక్నాలజీకి అనుగుణంగా ముందస్తు రోగాలు నిర్ధారణ చేయడం సాధ్యమవుతోందన్నారు. ఝార్సుగుడ వంటి జిల్లాలో ఆరోగ్యకరమైన వాతావరణం సృష్టించేలా అందరూ సహకరించాలని కోరారు. మొదటి సెషన్‌లో మెంటల్ హెల్త్ ప్రయారిటీపై మోడరన్ మెడిసిన్ అన్న అంశంపై జరిగిన చర్చలో ముఖ్యవక్తగా డాక్టర్ ఎస్‌జే పాల్ పాల్గొని ప్రసంగించారు. అదేవిధంగా రెండొ సెషన్‌లో రొల్ ఆఫ్ ఆ ర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఇన్ రీప్రొడక్టివ్ మెడిసిన్ అన్న అంశంపై ముఖ్య వక్తగా పాల్గొన్న డాక్టర్ శక్తి కుమార్ త్రిపాఠి వివరించారు. అలాగే మూడో సెషన్‌లో ఫిజికల్ హెల్త్ ఎ హిస్టొరిక్ అప్రొచ్ అన్న అంశంపై జరగిన చర్చలో డాక్టర్ శక్తి కుమార్ త్రిపాఠి పాల్గొని ప్రసంగించారు. అంతకు ముందు ముఖ్యఅతిథిగా హాజరైన ఎస్‌పి రాఘవేంద్రకు ఇండియన్ మెడికల్ అసొసియేషన్ సంస్ధ సన్మానించింది.


