
కుమార్తె మృతదేహం వద్ద రోధిస్తున్న తల్లి
పర్లాకిమిడి: స్థానిక జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం ఉదయం నాలుగు నెలల గర్భంతో ఉన్న మైనర్ గిరిజన బాలిక మృతి చెందింది. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు.. గజపతి జిల్లా రాయఘడ బ్లాక్ లక్ష్మీపూర్ పంచాయతీ సన్నసోడా గ్రామానికి చెందిన కవితా శబర (15) అనే బాలిక జిర్‌జిరా ప్రభుత్వ కన్యాశ్రమం (రెసిడెన్సియల్ పాఠశాల)లో ఎనిమిదో తరగతి చదువుతోంది. ఏప్రిల్ 10వ తేదీన వార్షిక పరీక్షలు పూర్తవ్వడంతో గ్రామానికి వచ్చింది. అయితే గ్రామానికి వచ్చిన వారం రోజులకే విద్యార్థిని కవితా శబర అస్వస్థతకు గురవ్వడంతో గ్రామస్తులు పర్లాకిమిడి ప్రభుత్వ ఆస్పత్రికి శుక్రవారం తరలించారు. డాక్టర్లు పరీక్షలు చేసి ఆమె నాలుగు నెలల గర్భావస్థలో ఉందని కుటుంబ సభ్యులకు తెలిపారు.
అయితే కారణం తెలియకుండానే శనివారం వేకువజామున విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది. దీనిపై రామగిరి పోలీసుస్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఇన్‌చార్జి ఆనందపాత్రో కేసు నమోదు చేశారు. లక్ష్మీపూర్ పంచాయతీ జిర్ జిరా కన్యాశ్రమంలో మైనర్ బాలిక గర్భం దాల్చడంపై పాఠశాలలో సూపరింటెండెంట్, వార్డెన్ బాధ్యాతారహితంగా వ్యవహరించడమే కారణమని తల్లిదండ్రులు, గ్రామస్తులు విమర్శిస్తున్నారు. బాలిక మృతిపై విచారణ జరిపి అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎస్డీసీ చైర్మన్ మరియం రైతో ఆదేశించారు. దీనిపై జిల్లా సంక్షేమ శాఖ అధికారి సంతోష్ కుమార్ రోథోను ప్రశ్నించగా, బాలిక మరణంపై వివరాలు తెలియవని, ఆదివారం పాఠశాలకు వెళ్లి విచారించనున్నట్లు పేర్కొన్నారు.