
అమన్ నాగ్
● మరో ఏడుగురు నిందితుల పరార్ ● సినీ ఫక్కీలో పెట్రోల్ బంక్ మేనేజర్‌ను దోచుకున్న దుండగులు
జయపురం: దారి కాచి, సినీ ఫక్కీలో వ్యక్తిని దోచుకున్న దొంగల మఠాలో ఇద్దరు నిందితులు పోలీసులకు పట్టుబడ్డారు. ముఠాలో మరో ఏడుగురు పరారీలో ఉన్నారని సదర్ పోలీసు అధికారి ఈశ్వర తండి వెల్లడించారు. నిందితులు జయపురం సమితి ఉమ్మిరి గ్రామానికి చెందిన జిత్తు దాస్(21), మొకాపుట్ గ్రామవాసి అమన్ నాగ్(21)గా తెలిపారు. అలాగే ఉమ్మిరి గ్రామానికి చెందిన డేవిడ్, మొకాపుట్‌కు చెందిన సంజయనాగ్, పల్లిగుడ గ్రామవాసి గోపి, కలిమగుడకు చెందిన బాబుల్, తెలియ గ్రామవాసి వికాశ్, భత్ర గ్రామానికి చెందిన రితిక్ పరారీలు ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నట్లు ప్రకటించారు. వివరాల్లోకి వెళ్తే... కుంద్రా లోని భగవతి పెట్రోల్ బంక్ మేనేజర్ అరవింద మండల్(35)ను దోచుకోవడానికి ముఠా సభ్యులు పథకం వేశారు. ఈనెల 22న రాత్రి 8గంటల సమయంలో ఆయన కదలికలపై నిఘా పెట్టారు. రాత్రి 10గంటల సమయంలో మేనేజర్ కుంద్రా నుంచి తన స్వగ్రామం పంపుణీకి బైక్‌పై బయలుదేరారు. ద్విచక్ర వాహనాలపై ఆయనను వెంబడించిన దుండగులు పెడియకోల కూడలి వద్ద వాహనాన్ని అడ్డుకున్నారు. వెదురు దుంగతో అతని తలపై దాడిచేశారు. అయితే తలకు హెల్మెట్ ఉండటంతో మేనేజర్ చాకచక్యంగా తప్పించుకోగా.. తన గ్రామం సమీపంలోని హనుమాన్ మందిరంలోకి దూరి తల దాచుకొన్నారు. వెంటనే తన మిత్రులకు ఫోన్ చేసి, పరిస్థితిని తెలియజేశారు. వెంటనే అతని మిత్రులు, గ్రామస్తులు అక్కడికి చేరుకునే సరికి దుండగులు మందిరంలోకి ప్రవేశించి, మేనేజర్ వద్ద ఉన్న రూ.20,300లు దోచుకుపోయారు.
మొత్తం 9మంది..
గ్రామస్తులను గమనించిన దుండగులు అక్కడి నుంచి సమీపంలోని అడవిలోకి పారిపోయారు. వారిని వెంబడించగా, ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. అదేరోజు రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న జయపురం సదర్ పోలీసు స్టేషన్ ఏఎస్‌ఐ జీపీ బెహరాకు సమాచారం అందించగా, సిబ్బందితో సహా గ్రామానికి చేరుకున్నారు. పట్టుబడిన ఇద్దరు దుండగులను అదుపులోకి తీసుకోవడంతో పాటు మేనేజర్ నుంచి దోచుకున్న నగుదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వారిని విచారించగా, దోపిడీలో మొత్తం 9మంది పాల్గొన్నట్లు తేలింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. పరారైన వారి కోసం గాలిస్తున్నట్లు వివరించారు.

జిత్తు దాస్