
శ్రీకాకుళం: వైద్యులు ప్రజాసేవ చేసేందుకు ఎంతో అవకాశం ఉంటుందని కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్ అన్నారు. రిమ్స్ వైద్య కళాశాలలో 2017 బ్యాచ్ వైద్య విద్యార్థులకు డిగ్రీ ప్రదానోత్సవం (స్నాతకోత్సవం) కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిగ్రీ తీసుకున్న విద్యార్థులు పీజీలు కూడా పూర్తి చేసి ఆరోగ్య సమాజ నిర్మాణానికి కృషి చేయాలని కోరారు. ఉత్సాహవంతమైన వాతావరణంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని చూస్తుంటే తాను చదువుకున్న రోజుల్లో స్నాతకోత్సవానికి హాజరు కాలేక పోవడం బాధ కలిగిస్తోందన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటాచలం మాట్లాడుతూ వైద్య వృత్తి పవిత్రమైనదని, ఆరోగ్యం బాగుంటేనే ప్రజలు దేనినైనా సాధించగలుగుతారని అన్నారు. ఈ సందర్భంగా 2017కు చెందిన 99మంది విద్యార్థులకు డిగ్రీ ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ ఆస్పత్రి సూపరింటెండెంట్ మురళీ కృష్ణ, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ డి.కోటేశ్వరరరావు, ఫార్మకాలజీ హెచ్‌ఓడీ డాక్టర్ శ్యామల, తదితరులు పాల్గొన్నారు.
గిరిజన రైతు ఆత్మహత్య
పాచిపెంట: మండలంలోని కేరంగి పంచాయతీ కొండమోసూరులో పురుగు మందుతాగి గిరిజన రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గత ఏడాది వర్షాల కారణంగా గ్రామానికి చెందిన గిరిజన రైతు సోములు బోడియ్య జీడిమామిడి పంటకు నష్టం వాటిల్లింది. దీంతో అప్పటి నుంచి తీవ్ర మనస్తాపానికి గురై మద్యానికి బానిసయ్యాడు, మద్యం మత్తులో గురువారం ఉదయం పొలానికి వెళ్లి పురుగుమందు తాగాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య, కుటుంబసభ్యులు సాలూరు సీహెచ్‌సీకి తీసుకువెళ్లగా పరిస్థితి విషమంగా ఉండడంతో విజయనగరం కేంద్రాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతిచెందాడు.