
శ్రీమందిరం సీఏఓ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక ఉపసంఘం
భువనేశ్వర్: పూరీ జగన్నాథాలయ కార్యాలయంలో ఆర్థిక ఉపసంఘం సమావేశం సోమవారం నిర్వహించారు. ప్రధాన పాలనాధికారి(సీఏఓ) వీర్‌విక్రమ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో శ్రీమందిరం 2023–24 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రతిపాదనలు, 2022–23 బడ్జెట్ వినియోగంపై చర్చించారు. త్వరలో జరగనున్న పాలకమండలి సమావేశంలో బడ్జెట్‌ను ఆమోదించనున్నట్లు ప్రకటించారు. గత ఏడాది తరహాలో ఈ ఏడాది కూడా మిగులు బడ్జెట్ అంచనాలు చర్చకు వచ్చినట్లు సీఏఓ తెలిపారు. గ్రాంట్–ఇన్–ఎయిడ్ మీద ఆధారపడకుండా స్వతంత్ర వనరులతో ముందుకు సాగే యోచనతో ఆదాయ వనరుల్ని సమీకరించనున్నామన్నారు. ప్రధానంగా జగన్నాథుని భూముల సద్వినియోగంతో ఆదాయం పెంపొందించే యోచిస్తున్నామని పేర్కొన్నారు. భూముల విక్రయం, సులభ రీతిలో వివాదల పరిష్కారం ప్రతిపాదనలు ప్రభుత్వ ఆమోదానికి సిఫార్సు చేశామన్నారు. ప్రభుత్వ అనుమతి లభించడంతో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. కొత్త సంవత్సర బడ్జెట్ ప్రతిపాదనల్లో రూ.300 కోట్ల 79 లక్షల ఆదాయం, రూ.262 కోట్ల 49 లక్షల వ్యయ అంచనాలతో సమగ్రంగా రూ.38 కోట్ల 30 లక్షల మిగులు బడ్జెట్‌ను ప్రతిపాదించినట్లు వెల్లడించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ సమర్థవర్మ, చార్టర్డ్ అకౌంటెంట్, ఫైనాన్స్ సబ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
సమావేశమైన శ్రీమందిరం ఆర్థిక
ఉపసంఘం