రాష్ట్రంలో కోవిడ్‌ ఛాయలు

ప్రతిభ చూపిన వైద్యులను సన్మానిస్తున్న డాక్టర్‌ బిపిన్‌ మిశ్రా - Sakshi

● ఆస్పత్రిలో చేరిన బాధితుడు

భువనేశ్వర్‌: దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో క్రమంగా ఈ ఛాయలు బలపడుతున్నాయి. రాష్ట్రంలో 53మందిలో రోగ నిర్థారణ జరిగినట్లు ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌ నిరంజన్‌ మిశ్రా సోమవారం తెలిపారు. వీరిలో ఒకరు చికిత్స కోసం ఆస్పత్రిలో చేరినట్లు పేర్కొన్నారు. రోజువారీ కోవిడ్‌ పాజిటివ్‌ సంఖ్య 12కంటే తక్కువగా కొనసాగుతుందన్నారు. గత కొన్ని రోజులుగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కోవిడ్‌ సంఖ్య పెరుగుతోంది. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్‌లో కొన్ని పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇతర వ్యాధులతో బాధపడుతున్న రోగులపై కోవిడ్‌ ప్రభావం కొంచెం ఎక్కువగా ఉంటుందని డైరెక్టర్‌ తెలియజేశారు. అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు.

గంజాయితో నిందితుడి అరెస్ట్‌

బరంపురం: గంజాం–కొందమాల్‌ జిల్లాల సరిహద్దు తప్పపాణి ఘాట్‌ రోడ్డులో అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని బల్లిగుడా పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఓ నిందితుడిని అరెస్ట్‌ చేశారు. ఐఐసీ అధికారి తపన్‌కుమార్‌ నాయక్‌ తెలిపిన వివరాల ప్రకారం తప్పపాణి ఘాట్‌ రోడ్డు నుంచి బరంపురం మీదుగా అక్రమంగా గంజాయి రవాణా జరుగుతున్ననట్లు సమాచారం అందింది. ఈ మేరకు వాహన తనిఖీలు చేపట్టగా, అటుగా వస్తున్న కారులో గంజాయి మూటలు బయట పడ్డాయి. మొత్తం 35కిలోల సరుకుతో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. బంజ్‌నగర్‌ జిల్లా గంగపూర్‌ గ్రామానికి సత్యజిత్‌ పాణిగ్రహిని అరెస్ట్‌ చేశారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.

ప్రజలకు ఆయుర్వేదాన్ని చేరువ చేయాలి

జయపురం: ఆయుర్వేద వైద్యం ఎంతో ప్రాచీనమైనదని, దీనిని ప్రజలకు మరింత చేరువ చేయాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. పట్టణంలోని ప్రైవేటు కల్యాణ మండపంలో దక్షిణ ఒడిశా ఆయుర్వేద వికాశ పరిషత్‌ వార్శికోత్సవం సోమవారం నిర్వహించారు. డాక్టర్‌ సుదర్శన గౌఢ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్‌ బిపిన్‌ బిహారి మిశ్రా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఆయుర్వేద వైద్యం పట్ల ప్రజల్లో కొంతవరకు అవగాహన ఏర్పడిందన్నారు. దీనిని మరింత పెంపొందించాల్సిన అవశ్యకత వైద్యుల పైనే ఉందని తెలిపారు. వికాశ పరిషత్‌ ఉన్నతి కోసం నిధులు సమకూర్చినట్లు పేర్కొన్నారు. అల్లోపతి కంటే ఆయుర్వేదం నమ్మకమైన వైద్యమని, భారతీయ మూలాల నుంచే ఇది ప్రారంభమైందని పేర్కొన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన 60మంది ఆయుర్వేద వైద్యులను సన్మానించారు. కార్యదర్శి పరమేశ్వర పాత్రొ వార్శిక నివేదిక వినిపించారు. కార్యక్రమంలో భాగంగా ఆయుర్వేద వైద్యంలో అనుభవాలపై అవగాహన పోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఆయుర్వేద వికాశ పరిషత్‌ ఉపాధ్యక్షుడు క్షేత్రవాసి పండా, సహాయ కార్యదర్శి డాక్టర్‌ సత్యనారాయణ పరిచ, కోశాధికారి భభాణి చరణ ఆచార్య తదితరులు పాల్గొన్నారు.

Read latest Orissa News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top