
అధికారులు పట్టుకున్న బియ్యం బస్తాలు, వ్యాన్
జయపురం: ప్రభుత్వ అందజేస్తున్న వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ పెన్షన్ మొత్తాన్ని పెంచాల ని, అలాగే ప్రతినెలా క్రమం తప్పకుండా చెల్లించాలని జయపురం పట్టణ, సమితిలోని పింఛన్ లబ్ధిదారులు కోరారు. ఈ మేరకు సామాజిక కార్యకర్త బి.హరిరావు ఆధ్వర్యంలో వందలాది మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు జయపురం రథపొడియా నుంచి సబ్‌కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సబ్ కలెక్టర్ దేవధర ప్రధాన్‌ను కలి సి, వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో కేవ లం రూ.500లు మాత్రమే పెన్షన్ ఇస్తున్నారని, చుట్టుపక్కల రాష్ట్రాల్లో రూ.2 వేలకు పైగా ఇస్తున్నారని తెలియజేశారు. పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలు, ఖర్చులను దృష్టి లో పెట్టుకొని పెన్షన్ మొత్తాన్ని పెంచాలన్నా రు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ఇంటి వద్దకే వచ్చి, పింఛన్ అందిస్తున్న తరహాలో ఒడిశాలో కూడా వృద్ధులు, దివ్యాంగులకు బ్యాంకు ఖాతాలో నగదు జమ చేసేలా చర్యలు చేపట్టాలని విన్నవించారు.
70 బస్తాల పీడీఎస్ బియ్యం పట్టివేత
సరుబుజ్జిలి: సారవకోట మండలం బుడితి గ్రామానికి అక్రమంగా తరలిస్తున్న 70 బస్తాల పీడీఎస్ బియ్యాన్ని సరుబుజ్జిలి జంక్షన్లో సోమవారం పట్టుకున్నామని విజిలెన్స్ అధికారులు తెలిపారు. బూర్జ మండలానికి చెందిన వండాన చిన్నంనాయుడు, సవర బిజియో బొలేరో వ్యాన్‌లో బియాన్ని అమ్మకానికి తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు దాడులు చేశామన్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని స్థానంగా ఉన్న సివిల్ సప్లయ్ గొడౌన్‌కు, వాహనాన్ని స్థానిక పోలీస్ స్టేషన్‌కు అప్పగించినట్లు విజిలెన్స్ అధికారులు వెల్లడించారు. దాడుల్లో విజిలెన్స్ ఎస్సై ఎన్.అశోక్ చక్రవర్తి, సీఎస్‌డీటీ డబ్బీరు రామకృష్ణ, హెడ్‌కానిస్టేబుల్ అప్పన్న, కానిస్టేబుళ్లు శేషగిరి, ఈశ్వరరావు, వీఆర్వో ధర్మారావు పాల్గొన్నారు.
టైర్ పంక్చరై అదుపుతప్పిన బస్సు
ఎచ్చెర్ల క్యాంపస్: జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. 16వ నంబర్ జాతీయ రహదారిపై ఫరీదుపేట పంచాయతీ కొయ్యరా ళ్లు కూడలి వద్ద ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వస్తున్న బస్సు కొద్ది నిమిషాల్లో కాంప్లెక్స్‌కు చేరుకోవాల్సి ఉంది. అయితే కొయ్యరాళ్లు సమీపంలో బస్సు టైరు పంక్చరైంది. దీంతో ఒక్కసారిగా ఐరన్ గ్రిల్స్‌తో ఉన్న డివైడర్‌ను ఢీకొట్టి నిలిచిపోయింది. అయితే ఈ ఘటనలో ప్రయాణికులెవరూ గాయపడలేదు. బస్సు ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. ప్రమాద సమాచారాన్ని డ్రైవర్ అధికారులకు తెలియజేశారు. వెంటనే స్పందించిన అధికారులు మరో బస్సును రప్పించి ప్రయాణికులను పంపించారు. ఘటనా స్థలాని కి చేరుకున్న పోలీసులు, హైవే సిబ్బంది క్రేన్ సహాయంతో బస్సును రోడ్డు పక్కకు తొలిగించారు. ప్రమాద సమయంలో వాహనాలు ఏమీ రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఎచ్చెర్ల పోలీసులు నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
జాతీయ పోటీల్లో విజేతలుగా నిలవాలి
శ్రీకాకుళం క్రైమ్: పూణేలో జరగనున్న జాతీయస్థాయి ఫెన్సింగ్ పోటీల్లో రాణించి విజేతలుగా తిరిగి రావాలని జిల్లా ఎస్పీ జి.ఆర్.రాధిక ఆకాంక్షించారు. శ్రీకాకుళం జిల్లా నుంచి ఇద్దరు క్రీడాకారిణులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరిని జిల్లా పోలీసు కార్యాలయానికి సోమవారం పిలుపించుకొని ఆల్‌దిబెస్ట్ చెప్పారు. అలాగే కాకినాడలో ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి సీనియర్ ఫెన్సింగ్ పోటీల్లో పతకాలు సాధించిన నలుగురు క్రీడాకారిణులను కూడా ఆమె అభినందించారు. చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని సూచించారు.
క్రీడాకారిణుల వివరాలు..
మహారాష్ట్రలోని పూణే వేదికగా ఫెన్సింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 24 నుంచి 28 వరకు జరగనున్న సీనియర్ విభాగం పోటీలకు జిల్లా నుంచి ఫోయిల్ విభాగంలో బడి పూజిత, ఇప్పీ విభాగంలో గురుగుబెల్లి అక్షయ ఎంపికయ్యారు. అలాగే ఫెన్సింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో కాకినాడ వేదికగా ఈ నెల 10, 11 తేదీల్లో జరిగిన సీనియర్ ఇంటర్ జిల్లా పురుషులు, మహిళల విభాగంలో నలుగురు క్రీడాకారిణులు సత్తా చట్టారు.

ప్రమాదానికి గురైన బస్సు

నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహిస్తున్న వృద్ధులు