
రికవరీ చేసిన ఫోన్‌ను బాధితురాలికి అందజేస్తున్న ఎస్పీ దీపిక
విజయనగరం క్రైమ్: జిల్లాలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్స్‌ను ట్రేస్ చేసేందుకు పోలీస్‌శాఖ ప్రవేశపెట్టిన వాట్సాప్ నంబర్‌కు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా 80 స్మార్ట్ ఫోన్‌లను రికవరీ చేసినట్లు ఎస్పీ ఎం.దీపిక పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో వివరాలను వెల్లడించి, బాధితులకు ఫోన్‌లను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విజయనగరం మొబైల్ ట్రాకర్ డాట్ ఇన్ వెబ్‌సైట్, వాట్సాప్ నంబర్ 8977945606కు వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి, రూ.13.88 లక్షల విలువైన 80 ఫోన్‌లను రికవరీ చేయగలిగామన్నారు. మనరాష్ట్రంలోని ఇతర జిల్లాలు, ఒడిశా, ఝార్ఘండ్, బీహార్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఉన్న వారు పోయిన మొబైల్స్‌ను వినియోగిస్తున్నట్లు గుర్తించామన్నారు. సైబర్‌సెల్ పోలీసులు మొబైల్ వినియోగిస్తున్న వారితో మాట్లాడి, ఆయా ప్రాంతాల నుంచి వాటిని రికవరీ చేశామన్నారు. రికవరీ చేయడానికి ఎంతో శ్రమించి, పనిచేసిన సైబర్ సెల్ ఎస్సై ఎం.ప్రశాంత్‌కుమార్, కానిస్టేబుళ్లు బి.వాసుదేవరావు, ఎం.శ్రీనివాసరావు, ఎన్.రాజేష్, టి.తిరుపతినాయుడులను ఎస్పీ అఽభినందించారు. రికవరీ చేసిన 80 మొబైల్స్‌ను ఎస్పీ ఎం.దీపిక చేతులమీదుగా బాధితులకు తిరిగి అందజేయడంతో వారిలో ఆనందం వెల్లివిరిసింది. కార్యక్రమంలో విజయనగరం ఇన్చార్జ్ డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, స్పెషల్ బ్రాంచ్ సీఐ జి.రాంబాబు, ఎస్సైలు ప్రశాంతకుమార్, నసీమాబేగం, సాగర్‌బాబు, వీరబాబు తదితరులు పాల్గొన్నారు.