
పర్లాకిమిడి: రైల్వేస్టేషన్ వద్ద ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
గోడ పడి చిన్నారి మృతి..
మల్కన్‌గిరి: జిల్లాలోని పొడియా సమితి మెటగూడ గ్రామంలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఇంటి మట్టిగోడ కూలి, 5నెలల చిన్నారి మృతిచెందింది. గ్రామానికి చెందిన మడకామి తన భార్య, పిల్లలతో కలిసి నిద్రపోతున్న సమయంలో అకస్మాతుగా గోడ కూలడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. మిగతా వారికి గాయాలు కావడంతో బాధితులను పొడియా ఆరోగ్య కేంద్రానికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
బరంపురం: బంగాళాఖాతంలో ఏర్పడిన ధ్రోణి మరింత బలహీన పడటంతో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం రాత్రి నుంచి ఆదివారం రోజంతా కుండపోతగా వర్షం కురవడంతో గంజాం జిల్లాలో వాగులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. ప్రధాన మార్గాల్లో రాకపోకలు స్తంభించి, జన జీవనానికి అంతరాయం ఏర్పడింది. రుశికుల్యా నదితో పాటు గడాహడా, బగ్గువా, బగ్గలట్టి, బొడ నదుల నీటిమట్ట పెరిగింది.
జయపురంలో 148.2 మిల్లీమీటర్లు
జయపురం: పట్టణంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు 148.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలు, గాలల కారణంగా జయపురం పట్టణంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో అంధకారం నెలకొంది. విద్యుత్ విభాగ సిబ్బంది వర్షంలో కూడా పనులు చేసినా పలు ప్రాంతాల్లో ఇంకా చీకట్లు వీడలేదు. ఎంజీ రోడ్డు, మెయిన్ రోడ్డుతో పాటు పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అకాల వర్షాలతో మామిడి, జీడి మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిళ్లిందని రైతులు వాపోయారు.
కల్యాణ సింగుపూర్‌లో అత్యధిక వర్షపాతం..
రాయగడ: గత 24గంటల్లో జిల్లాలో కురిసిన వర్షాలతో కల్యాణ సింగుపూర్‌లో అత్యధిక వర్షపాతం నమోదైందని అధికారులు ప్రకటించారు. మునిగుడలో 39.7, రాయగడ 19.6, కొలనార 12.5, కల్యాణ సింగుపూర్ 42.6, కాసీపూర్‌లో 37.2, గుణుపూర్‌లో 20, పద్మపూర్‌లో 15.3, గుడారిలో 15.4, రామనగుడ 38.6, బిసంకటక్ 31.6 చంద్రపూర్‌లో 14.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
మల్కన్‌గిరి జిల్లాలో..
మల్కన్‌గిరి: జిల్లాలోని మత్తిలి సమితి టేముర్‌పల్లి, మహుపోదర్, కర్తాన్‌పల్లి, సలీమ్, క్యాంగ్ ప్రాంతాల్లో కురిసిన వర్షం, గాలుల ధాటికి ఇంటి రేకులు ఎగిరిపోయాయి. రోడ్డుకు అడ్డంగా చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందుల పాలయ్యారు. మత్తిలిలో దెబ్బతిన్న ఇళ్లను అదనపు తహసీల్దార్ భ్రజ బిహరీ పరిశీలించారు. బాధిత కుటుంబాలకు టార్ఫాన్లు, ఆహార సామగ్రి అందజేశారు.
ప్రయాణికుల కష్టాలు..
పర్లాకిమిడి: పట్టణంలోని రైల్వేస్టేషన్‌లో ఫ్లాట్‌ఫాం నిర్మాణం పూర్తి కాకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. ఆదివారం ఉదయం గుణుపురం–పూరీ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ వచ్చే సమయంలో వర్షం కురవడంతో రైలు ఎక్కేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
వివిధ జిల్లాల్లో భారీ వర్షాలు
నేలకూలిన చెట్లు, ఇళ్లు

బరంపురం: గోపాల్‌పూర్ తీరంలో ఎగసి పడుతున్న సముద్ర కెరటాలు

మల్కన్‌గిరి: దెబ్బతిన్న ఇంటిపై టార్ఫాన్ కప్పుడుతున్న దృశ్యం

మల్కన్‌గిరి: సలీమ్‌లో దెబ్బతిన్న ఇంటి పైకప్పును చూపిస్తున్న బాధితుడు

చిన్నారి మృతదేహం