రోగులకు రవాణా ఉచితం

108 అంబులెన్సు ద్వారా  కిడ్నీ రోగి తరలింపు  - Sakshi

రాష్ట్రంలోని జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రజారోగ్యమే మహాభాగ్యంగా భావిస్తూ తొలి ప్రాధాన్యతనిస్తోంది. ఇందులో భాగంగా పలు రకాల పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతోంది. డయాలిసిస్‌ రోగులకు సంబంధిత కేంద్రాల్లో చికిత్స కోసం తరలించేందుకు ఉచిత రవాణా సదుపాయం కల్పించి వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ వారి మన్ననలు పొందుతోంది.
● 108 అంబులెన్సుల ద్వారా డయాలసిస్‌ రోగుల తరలింపు ● నెలకు 500 మంది వరకు తరలింపు ● వారంలో ఎన్ని రోజులైనా ఉపయోగించుకునే అవకాశం ● జిల్లాలో ఉన్న 108 అంబులెన్సులు 28

నెలకు 500 మంది వరకు

తరలింపు

డయాలసిస్‌ అవసరమైన రోగులను జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఉన్న డయాలసిస్‌ సెంటర్‌కు 108 అంబులెన్సు ద్వారా తరలిస్తారు. వారంలో ఎన్ని రోజులైనా డయాలసిస్‌ రోగి 108 అంబులెన్సును వినియోగించుకోవచ్చు. నెలకు 400 నుంచి 500 మంది వరకు రోగులను తరలిస్తున్నారు. జిల్లాలో 108 అంబులెన్సులు 28 ఉన్నాయి. వీటిని కిడ్నీ రోగులు వినియోగించుకుంటున్నారు. రవాణా ఖర్చులు లేకపోవడంతో కొంత వరకు ఉపశమనం పొందుతున్నారు. గతంలో డయాలిసిస్‌ కేంద్రానికి రావాడానికి రూ. వందల్లో ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉండేది. దూర ప్రాంతాల వారైతే అంతకంటే ఎక్కువగానే ఖర్చు చేసేవారు. ప్రస్తుతం ఆ బాధ తప్పడంతో ఆర్థికంగా వెసులుబాటు లభించిందని సంతృప్తి పొందుతున్నారు.

విజయనగరం ఫోర్ట్‌:

ప్రజారోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తోంది. డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా వంటి పథకాల ద్వారా ప్రజలకు ఖరీదైన వైద్యాన్ని సైతం ఉచితంగా అందిస్తోంది. అంతేకాకుండా చికిత్స అనంతరం ఆరోగ్య భృతిని అందిస్తోంది. 104 వాహనాల ద్వారా రోగుల వద్దకు వెళ్లి వైద్యం అందిస్తున్నారు. ఆపదలో ఉన్న వారిని 108 అంబులెన్సు ద్వారా ఆస్పత్రికి తరలిస్తున్నారు. ముఖ్యంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులు డయాలసిస్‌ చేయించుకోవడానికి వారిని డయాలసిస్‌ సెంటర్‌కు ఉచితంగా 108 అంబులెన్సు ద్వారా తరలిస్తున్నారు.

గతంలో సొంత ఖర్చులతో...

2019 సంవత్సరానికి ముందు వరకు కిడ్నీ రోగులు డయాలసిస్‌ సెంటర్‌కు రావాలంటే సొంత ఖర్చులతో బస్సులోగాని, ఏదైనా వాహనాన్ని బుక్‌ చేసుకుని జిల్లా కేంద్రంలో ఉన్న డయాలసిస్‌ సెంటర్‌కు వచ్చేవారు. ప్రైవేటు వాహనాల్లో రావడం వల్ల వారు ఇబ్బంది పడేవారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కిడ్నీ రోగులు డయాలసిస్‌ చేయించుకోవడానికి 108 అంబులెన్సు ద్వారా ఉచితంగా సంబంధిత కేంద్రానికి తరలిస్తున్నారు.

ఉచితంగా రవాణ

డయాలసిస్‌ అవసరమైన రోగులను 108 అంబులెన్సు ద్వారా డయాలసిస్‌ సెంటర్‌కు తరలిస్తున్నాం. నెలకు 500 మంది వరకు రోగులను ఇలా కేంద్రానికి చేర్చుతున్నాం. వారంలో ఎన్ని రోజులైనా వినియోగించుకోవచ్చు.

– మన్మధనాయుడు, 108 జిల్లా మేనేజర్‌

Read latest Orissa News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top