రెడ్డిగూడెం: పురుగు మందు తాగిన ఘటనలో ఆరు రోజుల క్రితం తల్లి మృతి చెందగా, కుమారుడు మంగళవారం చనిపోయారు. రెడ్డిగూడెం మండలంలోని కుదప గ్రామంలో నివసించే బొర్రా సావిత్రి(74), తిరుపతయ్య (47) తల్లీకుమారులు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ నెల ఎనిమిదో తేదీన ఇంటిలో ఎవరూ లేని సమయంలో సావిత్రి, తిరుపతయ్య పురుగు మందు తాగారు. కొద్ది సేపటికి వారిద్దరిని గుర్తించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడ ప్రభుత్వాస్పత్రిలోకి తరలించారు. పరిస్థితి విషమించి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సావిత్రి ఈ నెల తొమ్మిదో తేదీన మృతి చెందింది. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తిరుపతయ్య మంగళవారం ఉదయం పది గంటలకు మృతిచెందాడు.
తాగుడుకు బానిసై...
నూజివీడు మండలం మీర్జాపురం గ్రామానికి చెందిన బొర్రా తిరుపతయ్య కుటుంబం రెండు సంవత్సరాల క్రితం రెడ్డిగూడెం మండలం కుదప గ్రామంలో ఓ ఇంటిని కొనుగోలు చేసి నివసిస్తోంది. తిరుపతయ్య లారీ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. తిరుపతయ్య భార్య, కుమారుడు, కుమార్తె ఇంటి నుంచి బయటకు వెళ్లిన సమయంలో తల్లి సావిత్రితో కలిసి పురుగు మందు తాగాడు. తిరుపతయ్య కొడుకు ప్రభాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆరు రోజుల వ్యవధిలో తల్లీ కుమారులు మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
గుడివాడరూరల్: వృద్ధురాలి ఆత్మహత్యపై కేసు నమోదు చేసినట్లు గుడివాడ తాలూకా పోలీసులు మంగళవారం తెలిపారు. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని బొమ్ములూరు గ్రామానికి చెందిన జాస్తి నిర్మలాదేవి (81) కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపతోంది. విజయవాడలో పలుమార్లు చికిత్స పొందినప్పటికీ ఆరోగ్యం కుదటపడలేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె ఈ నెల తొమ్మిదో తేదీన ఎలుకల మందు తిని ఆత్మహత్యకు పాల్పడింది. అస్వస్థతకు గురైన నిర్వలాదేవిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య సేవల అనంతరం మెరుగైన చికిత్స కోసం విజయవాడ తీసుకెళ్లారు. అక్కడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి నిర్మలాదేవి సోమవారం మృతి చెందింది. మృతురాలి పెద్ద కుమారుడు సాంబశివరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గూడూరు: బతుకుతెరువు కోసం రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చిన ఒడిశా కూలీ గూడూరు మండలం తరకటూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. మంగళవారం పొద్దుపోయాక జరిగిన ఈ ప్రమాదంపై గూడూరు పోలీసులు దర్యాప్తు చేస్తు న్నారు. ఒడిశాకు చెందిన వ్యక్తి తరకటూరుపాలెం సమీపంలోని ఓ రైసు మిల్లులో కూలి పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం పని ముగించు కుని విజయవాడ–మచిలీపట్నం రోడ్డు దాడుతుండగా విజయవాడ వైపు నుంచి అతివేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే మృతిచెందాడు. కారు డ్రైవర్ వాహనం ఆపకుండా వెళ్లిపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ సీహెచ్.దివ్యప్రకాష్ ఘటనా స్థలంలో ముక్కలు ముక్కలుగా పడిపోయి ఉన్న వాహనం నంబర్ ప్లేట్ ఆధారంగా కారును గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. మృతదేహానికి శవపంచనామా నిర్వహించి, పోస్టు మార్టం నిమిత్తం బందరు సర్వజన ఆస్పత్రికి తరలించారు. మృతుడు స్థానికుడు కాకపోవడంతో అతని పూర్తి వివరాల కోసం పోసులు ఆరా తీస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం (ఒలింపిక్ డే) సందర్భంగా జూన్ 23వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా తమ సంఘం ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపడ్తామని ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసో సియేషన్ (ఏపీఓఏ) అధ్యక్షుడు ఆర్.కె.పురుషోత్తమ్ తెలిపారు. త్వరలో ఒలింపిక్ జిల్లా సంఘాలకు ఎన్నికలు ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఏపీఓఏ జన రల్ బాడీ సమావేశం నగరంలోని ఓ హోటల్‌లో మంగళవారం జరిగింది. సమావేశం అనంతరం జరిగిన పురుషోత్తమ్ విలేకరులతో మాట్లాడారు. 2036వ సంవత్సరంలో ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వాలన్న భారతదేశ ప్రతిపాదితకు గుర్తుగా జూన్ 23వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 2,036 మొక్కలను నాటాలని నిర్ణయించామన్నారు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) మార్గదర్శకాలకు అనుగుణంగా చిత్తూరు జిల్లాకు చెందిన విశ్రాంత బ్యాంక్ మేనేజర్, మాజీ జాతీయ హాకీ క్రీడాకారుడు డి.ఎస్.వెంకటరామనాయుడును ఏపీఓఏ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా (సీఈఓ) ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని ఒలింపిక్ సంఘాలకు త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. ఐఓఏ నుంచి ఆర్థిక సహాయంతో జిల్లా, రాష్ట్ర, దక్షిణ మండల (సౌత్ జోన్) స్థాయిలలో ఒలింపిక్ తరహా పోటీలను నిర్వహించడానికి ఏపీఓఏ ప్రణాళిక రూపొందిస్తోందని వివరించారు. మేఘాలయలో జరిగే 39వ జాతీయ క్రీడల్లో ఏపీఓఏ తరఫున రాష్ట్ర జట్లను కూడా సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో ఏపీఓఏ ఉపాధ్యక్షులు బడేటి వెంకటరామయ్య, నడెళ్ల బ్రహ్మాజీరావు, కోశాధికారి శ్రీనివాస్, సీఈఓ వెంకటరామ నాయుడు, సభ్యులు పాల్గొన్నారు. అనంతరం మే 5, 6, 7 తేదీల్లో విజయనగరంలోని రాజీవ్ స్టేడియంలో జరిగే ఐదో ఏపీ కప్ తైక్వాండో స్టేట్ చాంపియన్‌షిప్ పోటీల పోస్టర్‌ను ఆవిష్కరించారు.


