కొడుకు, తల్లి కళ్లెదుటే మృత్యు ఒడికి.. | - | Sakshi
Sakshi News home page

కొడుకు, తల్లి కళ్లెదుటే మృత్యు ఒడికి..

Apr 15 2026 8:50 AM | Updated on Apr 15 2026 8:50 AM

తిరువూరు: నిత్యం కృష్ణా నదిలో ఈతకు వెళ్లి బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజ్‌ చేసే క్రమంలో విజయవాడలో నివసిస్తున్న తిరువూరుకు చెందిన దంతవైద్యుడు సానికొమ్ము సురేష్‌ (46) మంగళవారం తన కుమారుడు, తల్లి కళ్లెదుటే నీట మునిగి దుర్మరణం చెందారు. ఇబ్రహీంపట్నం నిమ్రా కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సురేష్‌ విజయవాడ బెంజిసర్కిల్‌ సమీపంలో నివసిస్తున్నారు. మంగళవారం తాడేపల్లి వద్ద కృష్ణానదిలో తన 12 కుమారుడితో కలసి ఈత కొట్టారు. అనంతరం బ్రీతింగ్‌ ఎక్సర్‌ సైజ్‌ చేస్తూ రెండుసార్లు నీటి నుంచి బయటకు వచ్చి మళ్లీ లోపలికి వెళ్లిన సురేష్‌ తదుపరి ఊపిరాడక చనిపోయారు. తిరువూరు నుంచి విజయవాడ ఆస్పత్రిలో వైద్యపరీక్షల నిమిత్తం వచ్చిన తల్లి సానికొమ్ము కుమారి కూడా ఆ సమయంలో సురేష్‌ సమీపంలోనే నది ఒడ్డున ఉన్నారు. ఈత కొట్టిన అనంతరం తల్లిని తిరువూరు బస్సు ఎక్కిస్తానని ఇంటి నుంచి తనతో కూడా తీసుకొచ్చిన సురేష్‌ ఎంతసేపటికీ నీటిలో నుంచి బయటకు రాకపోవడంతో కుమారి ఆందోళనతో తల్లడిల్లింది. చుట్టుపక్కల వారికి చెప్పడంతో గజ ఈతగాళ్లు గాలింపు జరిపారు. ఫలితం లేకపోవడంతో ఎన్‌ఆర్‌డీఎఫ్‌ సిబ్బంది గాలించి సురేష్‌ మృతదేహాన్ని వెలికితీశారు. పోలీసులు కేసునమోదు చేసుకుని ఆయన మృత దేహాన్ని మంగళగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. సురేష్‌ మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం తిరువూరు శివారు పీటీకొత్తూరు తరలించారు. ఆయన సోదరుడు ఆస్ట్రేలియాలో నివసిస్తుండగా, తండ్రి సీపీఎంలో, రైతుసంఘంలో జిల్లాస్థాయి పదవులు నిర్వహించారు. తల్లి కుమారి ఏపీ మహిళా సంఘ జిల్లా కార్యదర్శిగా ఉన్నారు. ఆయన మృతదేహాన్ని పలువురు ప్రముఖులు సందర్శించిన నివాళులర్పించారు.

కృష్ణానదిలో మునిగి దంత వైద్యుడు మృతి

Advertisement
 
Advertisement
Advertisement