నిమ్మ రైతుల ఆందోళన వేసవి ఎండలతో నిమ్మకాయలకు భారీగా డిమాండ్ దిగుబడి లేక లబోదిబోమంటున్న రైతులు రైతుకు లభిస్తున్న కేజీ ప్రస్తుత ధర రూ.80 నుంచి రూ.110 చీడపీడలతో దిగుబడి ఎకరాకు 10 క్వింటాళ్లకు మించడం లేదు ఎన్టీఆర్ జిల్లాలో 914.11ఎకరాల్లో నిమ్మసాగు
చీడపీడలపై అవగాహన కల్పిస్తున్నాం
జి.కొండూరు: మార్కెట్‌లో ధర ఉన్నా.. దిగుబడి లేకపోవడంతో నిమ్మ రైతు ఆందోళన చెందుతున్నాడు. వేసవి తాపాన్ని తీర్చడంలో నిమ్మకు ప్రాధాన్యమేర్పడింది. నిమ్మకు ధర ఉన్నా ఎన్టీఆర్ జిల్లాలో పురుగులు, తెగుళ్ల ప్రభావంతో దిగుబడి తగ్గడంతో రైతులు లబోదిబోమంటున్నారు. రెండు సీజన్లు కాపునకు వచ్చే నిమ్మ తొలకరిలో దిగుబడి బాగానే ఉంటున్నా ధర లేక.. ప్రస్తుతం గిట్టుబాటు ఉన్నా.. దిగుబడి లేక నిమ్మ పంటను సాగు చేస్తున్న రైతులు నష్టపోయారు.
దిగుబడి లేక...
ఎన్టీఆర్ జిల్లాలోని పదహారు మండలాల పరిధిలో 914.11ఎకరాల్లో నిమ్మసాగవుతోంది. అన్నీ కలిసొస్తే ఏడాదిలో ఎకరాకు యాభై కేజీల బస్తాలు.. 50 నుంచి 70 వరకు దిగుబడి వస్తుంది. ఇది మొక్కల వయస్సు, ఎకరంలో నాటిన మొక్కల మీద ఆధారపడి ఉంటుంది. గతేడాది తొలకరిలో దిగుబడి బాగా ఉన్నా, నిమ్మకాయల ధర కేజీ రూ.10 నుంచి రూ.12కి మించలేదు. ప్రస్తుతం కేజీ నిమ్మకాయల ధర రూ.80 నుంచి 110వరకు రైతుకు లభిస్తోంది. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాలో ఎకరానికి 10నుంచి 15బస్తాలకు దిగుబడి మించడంలేదు. దీంతో పెట్టుబడి కూడా వచ్చే అవకాశం కనపడటం లేదు.
చీడపీడలతో తీవ్ర నష్టం
ఈ ఏడాది జనవరిలో కురిసిన వర్షాలు.. జిల్లాలో నిమ్మ సాగుపై తీవ్ర ప్రభావం చూపాయి. పూత రాలి దిగుబడి తగ్గింది. క్రాసింగ్ మొక్కజొన్న సాగు, మామిడి తోటల్లో ఉండే నల్లిలాంటి రెక్కల పురుగు నిమ్మపై దాడి చేసి నష్ట పరిచింది. ఈ పురుగుకు నివారణ లేక నిమ్మకాయలను గోకి తినడంతో తెల్లటి మచ్చ ఏర్పడి కాయ నాణ్యత కోల్పోయింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించక నిమ్మకాయల సైజు కూడా పెరగకపోవడంతో డిమాండ్ ఉన్నా నాణ్యత లేక సరైన ధర లభించక రైతులు నష్టపోతున్నారు.
సాగుకు ‘ఉపాధి’లో ఆర్థిక సాయం
నిమ్మసాగు చేయాలనుకునే రైతులకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం వందశాతం ఆర్థిక సాయం అందిస్తోంది. ఐదు ఎకరాలలోపు రైతులకు ఎకరానికి 110మొక్కలకు రూ.1.20 లక్షలను మూడేళ్లపాటు అందిస్తున్నారు. ఈ పథకంలో తోటలను వేసిన రైతులు ముందుగా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. గతేడాది, ఈ ఏడాది అధికారులు పంటలను నమోదు చేసి ఆర్థిక సాయంకోసం ప్రభుత్వానికి నివేదిక పంపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాక రైతులు ఇబ్బంది పడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఉపాధి హామీ పథకంలో ఉద్యాన పంటలను సాగు చేసేందుకు రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఎన్టీఆర్ జిల్లాలో
నిమ్మ సాగు వివరాలు
మండలం సాగు ఎకరాల్లో
ఎ.కొండూరు 94.25
చందర్లపాడు 73.72
గంపలగూడెం 20.02
జి.కొండూరు 40.86
ఇబ్రహీంపట్నం 6.82
జగ్గయ్యపేట 46.09
కంచికచర్ల 7.00
మైలవరం 60.87
నందిగామ 60.87
పెనుగంచిప్రోలు 59.99
రెడ్డిగూడెం 32.76
తిరువూరు 40.02
వత్సవాయి 47.48
వీరులపాడు 55.00
విజయవాడరూరల్ 11.09
విస్సన్నపేట 257.27
ఉద్యానసాగు పెంపులో భాగంగా నిమ్మసాగును పెంచేలా రైతులను ప్రోత్సహిస్తున్నాం. వాతావరణ మార్పులు, చీడపీడలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. రైతులు తోటలను వ్యాపారులకు లీజుకు ఇవ్వడంతో నిర్వహణ లోపం ఎదురవుతోంది. ప్రస్తుతం నిమ్మ కాయల ధర ఆశాజనకంగానే ఉంది.
– పి.బాలాజీకుమార్,
ఉద్యానశాఖ అధికారి, ఎన్టీఆర్ జిల్లా


