మచిలీపట్నంఅర్బన్: సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని సమగ్ర శిక్ష కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్–జేఏసీ జిల్లా అధ్యక్షుడు కె.జాన్‌మోడీ డిమాండ్ చేశారు. బందరు మండల విద్యాశాఖాధికారి కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ప్రచార కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. హెచ్‌ఆర్ పాలసీ అమలు చేయడంతో పాటు సమాన పనికి సమాన వేతనం కల్పించాలని కోరారు. విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఎన్నికల ముందు కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని, సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తామని ఇచ్చిన హామీలు ఇప్పటివరకు నెరవేర్చలేదన్నారు. సమగ్ర శిక్షా ఉద్యోగులు 22 రోజుల పాటు నిర్వహించిన సమ్మె సమయంలో కూటమి పార్టీలు మద్దతు ప్రకటించి, ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. డిమాండ్ల సాధన కోసం మే 15వ తేదీ విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నివాసానికి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కుటుంబ సభ్యులతో కలిసి పాదయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజేష్, హమామాలిని, సూరమ్మ, సాయి లక్ష్మి, ఎలిజబెత్ రాణి, అంజలి, దివ్య, అంకమ్మ తదితరులు పాల్గొన్నారు.


