సమస్యలు పరిష్కరించకుంటే ప్రజాపోరాటం | - | Sakshi
Sakshi News home page

సమస్యలు పరిష్కరించకుంటే ప్రజాపోరాటం

Apr 14 2026 8:52 AM | Updated on Apr 14 2026 8:52 AM

చిలకలపూడి(మచిలీపట్నం): కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని, వారి సమస్యలు పరిష్కరించకపోతే ప్రజల పక్షాన పోరాటం చేస్తామని పామర్రు మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్‌కుమార్‌ పేర్కొన్నారు. మచిలీపట్నంలోని కృష్ణా జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)లో పామర్రు నియోజకవర్గానికి చెందిన పలు సమస్యలపై కలెక్టర్‌ డి.కె.బాలాజీకి వినతిపత్రం అందజేశారు. అనంతరం కలెక్టర్‌తో ఆయన పలు సమస్యలపై చర్చించారు. అనంతరం అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం ప్రజలను వంచనకు గురిచేస్తోందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చకుండా తిరిగి తమపై బురదజల్లే ప్రయత్నం చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్‌రాజా ఆగడాలకు అడ్డూ అదుపు లేదన్నారు. ఎన్నికల హామీలను విస్మరించటమే కాకుండా ధనార్జనే ధ్యేయంగా ఎమ్మెల్యే అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు, సామాన్య ప్రజలే లక్ష్యంగా పోలీసుల అండదండలతో అక్రమ కేసులు బనాయిస్తున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఏడు ఎకరాల స్థలాన్ని సేకరించగా ఆ స్థలం పేదలకు ఇవ్వకుండా కోర్టుల్లో పిటీషన్లు వేసి తాత్సారం చేస్తున్నారన్నారు. ఈ విషయాన్ని కలెక్టర్‌కు వివరించామని ఆయన త్వరలో పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. ప్రజలకు టిడ్కో ఇళ్లు ఇస్తామని ఎమ్మెల్యే కుమార్‌రాజా బూటకపు హామీ ఇస్తున్నా రని విమర్శించారు. పామర్రు నియోజకవర్గంలో ఇరిగేషన్‌కు సంబంధించిన చెరువులోని మట్టిని, ఇసుకను అక్రమంగా విక్రయిస్తున్నారని మండిపడ్డారు. లారీకి రూ.13 వేల చొప్పున రోజుకు 500 లారీల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని వివరించారు. అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్యే అండదండలతో రూ.లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని స్పష్టమైన ప్రణాళిక ద్వారా ఇసుక విక్రయించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరామన్నారు. ఇటీవల జరిగిన డీఆర్సీ సమావేశంలో ఎమ్మెల్యే కుమార్‌రాజా రెవెన్యూ అధికారులు లంచాలు తింటున్నారని ఆరోపించి, వారి నుంచి సొమ్ము దండుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నా రని పేర్కొన్నారు. తన అధికారం కోసం అధికారులను పావుగా వాడుకుని వారిని బలిపశువులను చేస్తున్నారన్నారు. ఈ సమస్యలు అన్నింటినీ కలెక్టర్‌ బాలాజీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఆయన పరిష్కరించని పక్షంలో ప్రజాపోరాటానికి సిద్ధమవుతామని కైలే అనిల్‌కుమార్‌ హెచ్చరించారు. వెంట పామర్రు ఎంపీపీ దాసరి అశోక్‌కుమార్‌, వైస్‌ ఎంపీపీ ఎ.రమాదేవి, రాజులపాటి రాఘవులు, ఎం.సుబ్రహ్మణ్యం, ఆరేపల్లి శ్రీనివాసరావు, నామా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

పేదలు అందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలి

ఇసుక అనధికార తవ్వకాలపై చర్యలు చేపట్టండి

పామర్రు ఎమ్మెల్యే కనుసన్నల్లోయథేచ్ఛగా అవినీతి, అక్రమాలు

కలెక్టర్‌ వినతిపత్రం అందజేసిన

మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్‌కుమార్‌

Advertisement
 
Advertisement
Advertisement