మచిలీపట్నంఅర్బన్: లేడీ యాంప్తిల్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకన కేంద్రాన్ని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా మూల్యాంకన ప్రక్రియను పరిశీలించి, నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. మూల్యాంకన కార్యక్రమంలో మొత్తం 775 మంది సిబ్బంది పాల్గొనగా, అందులో 80 మంది చీఫ్ ఎగ్జామి నర్లు, 461 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 234 మంది ఇతర సిబ్బంది ఉన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి యు.వి. సుబ్బారావు తదితర అధికారులు పాల్గొన్నారు.
హైవేపై ట్రాలీ లారీ బీభత్సం
కృష్ణలంక(విజయవాడతూర్పు): స్థానిక జాతీయ రహదారిపై నేతాజీ వంతెన వద్ద ట్రాలీ లారీ బీభత్సం సృష్టించింది. డ్రైవర్ నిర్లక్ష్యంగా అతివేగంగా నడుపుతుండగా లారీ అదుపు తప్పి ముందు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు, కారును ఢీకొంది. ఈ ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో వారధి వైపు నుంచి ఒక ట్రావెల్స్ బస్సు, కారు బెంజిసర్కిల్ వైపు వెళ్తున్నాయి. జాతీయ రహదారిపై నేతాజీ వంతెన వద్ద ఉన్న సాయిబాబా గుడి సమీపానికి చేరుకోగానే గుంటూరు జిల్లా తాడేపల్లి వైపు నుంచి ఆటోనగర్ వెళ్తున్న ట్రాలీ లారీ మితిమీరిన వేగంతో వచ్చి ట్రావెల్స్ బస్సు, కారును వెనుకవైపు ఢీకొట్టింది. దీంతో బస్సు, కారు వెనుకవైపు భాగాలు దెబ్బతిన్నాయి. ఎవరికీ ఎటువంటి గాయాలు తగలకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సమాచారం అందుకున్న కృష్ణలంక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిని పరీక్షించి మద్యం తాగినట్లు గుర్తించారు. లారీ డ్రైవర్‌పై డ్రంకెన్ డ్రైవ్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు కృష్ణలంక పోలీసులు తెలిపారు.
విశ్వబ్రాహ్మణ సంఘ ఎన్టీఆర్ జిల్లా కార్యవర్గం ఎన్నిక
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం రథసారథులుగా సాయికిరణ్, మోహన్ ఎన్నికయ్యారు. విజయవాడలో నిర్వహించిన సంఘ ఎన్నికల్లో సింహం గుర్తుపై పోటీ చేసిన కిరణ్ – మోహన్ ప్యానల్ 915 ఓట్లతో ఘన విజయం సాధించింది. సంఘం అధ్యక్ష, కార్యదర్శులుగా పి.సాయి కిరణ్, కందు కూరి మోహన్‌ను ప్యానల్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విశ్రాంత గ్రేడ్–2 ఆఫీసర్ వినుకొండ భవానీ దుర్గాప్రసాద్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ఈ ఎన్నికల ప్రక్రియలో సంఘ ఆహ్వాన కమిటీ చైర్మన్ చల్లాల శివాజి, అధ్యక్షుడు మునగంటి కామేశ్వరరావు, రామ కృష్ణ, శ్రీను, విజయవాడ నగర అధ్యక్షుడు గొర్తి శ్రీనివాస చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.


