నల్ల రిబ్బన్లతో స్పాట్‌కు హాజరైన ఉపాధ్యాయులు
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఉపాధ్యాయ, ఉద్యోగ సమస్యలను తక్షణం పరిష్కరించాలని ఫ్యాప్టో జిల్లా చైర్మన్ ఏ సుందరయ్య, కార్యదర్శి డాక్టర్ ఇంటి రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పదో తరగతి మూల్యాంకనం విజయవాడ కేబీఎన్ కళాశాల ఆవరణలో సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు నల్లరిబ్బన్‌లతో విధులకు హాజరై ప్రభుత్వానికి తమ నిరసనను తెలిపారు. ఈ సందర్భంగా సుందరయ్య, ఇంటి రాజులు మాట్లాడుతూ తక్షణం పీఆర్సీ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకూ 30 శాతం మధ్యంతర భృతి ఇవ్వాలని కోరారు. నిరసనలో పాల్గొన్న ఫ్యాప్టో రాష్ట్ర నాయకుడు ఎం. రఘునాథ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా కనీసం ఉద్యోగుల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవ న్నారు. ఈ నెల 25, 26, 27 తేదీల్లో రాష్ట్ర కేంద్రంలో నిరాహార దీక్షలు చేస్తున్నట్లు వివరించారు. ఫ్యాప్టో నాయకులు నాయకులు జి.రామరావు, వి. భిక్షమయ్య, సయ్యద్ ఖాసీం, వి.రాధిక, జి. అనుగ్రహప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఫ్యాప్టో ఉద్యమ కార్యాచరణ నోటీసుని ఎన్టీఆర్ జిల్లా విద్యాధికారి ఎల్. చంద్రకళకు అందించారు.


