ఎ.కొండూరు: రాష్ట్రంలో అత్యాధునిక సాంకేతిక రంగాన్ని పరుగులు పెట్టించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ప్రతిష్టాత్మకమైన క్వాంటం వ్యాలీ ఏర్పాటుకు కసరత్తు ముమ్మరం చేసింది. ఎ.కొండూరు మండలంలో సోమవారం రాష్ట్ర క్వాంటం వ్యాలీ ఎండీ శ్రీధర్ పర్యటించి, ప్రాజెక్టుకు అనువైన స్థలాలను పరిశీలించారు. మండలంలోని చీమలపాడు రెవెన్యూ పరిధిలో ఉన్న రామచంద్రాపురం గ్రామం, అలాగే కోమటికుంట గ్రామ పరిధిలోని ప్రభుత్వ భూములను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలో హార్డ్‌వేర్ ఎకో సిస్టమ్‌ను బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ క్వాంటం వ్యాలీలో ప్రధానంగా కంప్యూటర్ హార్డ్‌వేర్ తయారీ పరిశ్రమలను నెలకొల్పనున్నారు. ప్రస్తుతం ప్రభుత్వానికి చెందిన ఖాళీ భూముల వివరాలను సేకరిస్తున్నామని, పరిశ్రమల స్థాపనకు అనువైన వాతావరణం ఉన్న ప్రాంతాలను గుర్తిస్తున్నామని ఎండీ పేర్కొన్నారు. అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని, ఈ ప్రాంతాన్ని ఒక హార్డ్‌వేర్ హబ్‌గా తీర్చిదిద్దడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని ఆయన వివరించారు. రాష్ట్రంలో ఆధునిక సాంకేతిక రంగం అభివృద్ధికి క్వాంటం వ్యాలీ ఎంతగానో దోహదపడుతుందని, హార్డ్‌వేర్ ఎకో సిస్టమ్ అభివృద్ధి చెందేలా ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నామని చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా భవిష్యత్తులో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాలకు సంబంధించిన పరిశ్రమలు ఏర్పాటై స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశముందని తెలిపారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన మౌలిక వసతులు, రవాణా సౌకర్యాలు, భూబాగం అనుకూలత వంటి అంశాలను అధికారులు సమగ్రంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో తిరువూరు ఆర్డీవో ఎ.కుమార్, తహసీల్దార్ ఎం.ఉదయ్ భాస్కర్, ఆర్‌ఐ దివ్య ప్రసాద్ సర్వేయర్లు, వీఆర్వోలు పాల్గొన్నారు.


