ఆరుగురు మిత్రులు.. చోరీల్లో దిట్టలు | - | Sakshi
Sakshi News home page

ఆరుగురు మిత్రులు.. చోరీల్లో దిట్టలు

Apr 6 2026 8:30 AM | Updated on Apr 6 2026 8:30 AM

చెడు వ్యసనాలకు అలవాటు పడి చోరీల బాట ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడిన నిందితులు 99.5 గ్రాముల బంగారం, 437 గ్రాముల వెండి రికవరీ

గూడూరు: వారు ఆరుగురు స్నేహితులు. 19 నుంచి 22 ఏళ్లలోపు వారే.. పదో తరగతి, ఇంటర్మీడియెట్‌, డిగ్రీ ఫెయిలై చదువుకు దూరమయ్యారు. చెడు వ్యవసనాలకు అలవాటు పడి, అందుకు అవసరమైన డబ్బు కోసం చోరీల బాట పట్టారు. చివరికి పోలీసులకు చిక్కారు. గూడూరు పోలీస్‌ స్టేషన్‌లో ఈ కేసు వివరాలను బందరు ఇన్‌చార్జి డీఎస్పీ కె.ధర్మేంద్ర ఆదివారం విలేకరులకు తెలిపారు. ఆయన కథనం మేరకు.. గూడూరు మండలం మల్లవోలుకు చెందిన షేక్‌ అస్కర్‌, జాన్‌ వెస్లీ, పోలవరం గ్రామానికి చెందిన మువ్వల లీలాధర్‌, పెండ్ర దుర్గారావు, బులసర కోట నాగవెంకట సాయి, గుమ్మడి రాహుల్‌ దాదాపు ఒకే వయస్సు యువకులు. పదో తరగతి, ఇంటర్మీడియెట్‌, డిగ్రీ ఫెయిలై ఇంటిపట్టునే ఉంటూ జల్సాలు, ఆకతాయి తిరుగుళ్లకు అలవాటు పడ్డారు. తమ అవసరాలకు కష్టపడకుండా డబ్బులు సమకూర్చడం కోసం చోరీలకు పాల్పడటం ప్రారంభించారు. మల్లవోలు, పోలవరం, పెడన, విజయవాడ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడ్డారు. పగలు ద్విచక్రవాహనాలపై గల్లీల్లో తిరగటం, తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుర్తించడం, తర్వాత రెక్కీ నిర్వహించి ఆ ఇళ్లలోకి చొరబడి దొరికినంతా దోచుకెళ్లడం చేసేవారు. ఏడాదిన్నర కాలంలో ఎనిమిది చోట్ల దొంగతనాలకు పాల్పడ్డారు.

తీగలాగితే డొంక కదిలింది..

మల్లవోలు, పోలవరం గ్రామాల్లో ఇటీవలి కాలంలో తరచూ దొంగతనాలు జరుగుతున్నాయి. వీటిని సీరియస్‌గా తీసుకున్న గూడూరు ఎస్‌ఐ చల్లపల్లి దివ్య ప్రకాష్‌ ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. దొంగతనాలు జరిగిన ఇళ్లలో వేలిముద్రలు సేక రించి, పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పరిశీలించి, గతంలో చోరీలకు పాల్పడిన వారిని విచారిస్తూ కేసు దర్యాప్తు సాగించారు. ఈ నేపథ్యంలో ఆరుగురు స్నేహితుల్లో ఇద్దరు ఓ ద్విచక్రవాహనాన్ని ఎత్తుకెళ్లారు. ఆ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకుని విచారించగా ఆరుగురు చేసిన చోరీలు వెలుగు చూశాయి. సాంకేతికంగా కూడా ఆధారాలు సేకరించి ముఠాలో ఆరుగురు స్నేహితులను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద 99.5 గ్రాముల బంగారు ఆభరణాలు, 437 గ్రాముల వెండి వస్తువులతో పాటుగా మూడు మోటారు సైకిళ్లు, మూడు సెల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. దొంగల ముఠాను పట్టుకోవడంలో చాకచ క్యంగా వ్యవహరించిన పెడన సీఐ నాగేంద్ర ప్రసాద్‌, గూడూరు ఎస్‌ఐ చల్లపల్లి దివ్య ప్రకాష్‌, పెడన ఎస్‌ఐ షేక్‌ బషీర్‌, సీసీఎస్‌ సిబ్బందికి జిల్లా ఎస్పీ రివార్డులు ప్రకటించినట్లు డీఎస్పీ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement