
పేరుకే డివిజనల్ రైల్వే ఆస్పత్రి
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): పేరుకే డివిజనల్ రైల్వే ఆస్పత్రి.. కానీ వసతులు మాత్రం కానరావు. విజయవాడ రైల్వే డివిజన్ దువ్వాడ నుంచి గూడూరు వరకు విస్తరించి ఉంది. ఈ పరిధిలో లక్షల సంఖ్యలో ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినా ప్రధాన కేంద్రమైన విజయవాడ రైల్వే డివిజనల్ ఆస్పత్రికి వస్తుంటారు. ఇటువంటి ఆస్పత్రిలో సరైన మౌలిక సదుపాయాలు అందడం లేదని రోగులు, వారి కుటుంబ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
వసతులు ఏవీ?
డివిజన్‌లోని దువ్వాడ, రాజమండ్రి, సామర్లకోట, కాకినాడ, ఏలూరు, గుడివాడ, మచిలీపట్నం, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, బిట్రగుంట, కావలి, నెల్లూరు, గూడూరు తదితర ప్రాంతాల నుంచి అనారోగ్యంతో బాధపడే ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు తెల్లవారుజాము నుంచే ఆయా ప్రాంతాల నుంచి రైళ్లలో ప్రయాణించి విజయవాడ రైల్వే ఆస్పత్రికి వస్తుంటారు. కానీ సౌకర్యాలు లేకపోవడమే ఇక్కడ సమస్యగా మారింది.
వృద్ధుల పరిస్థితి మరింత దయనీయం
ముఖ్యంగా రైల్వే ఆస్పత్రికి వచ్చే వారిలో ఎక్కువగా వయోభారంతో బాధపడే విశ్రాంత ఉద్యోగులు ఉంటున్నారు. వారిలో ఎవరైనా ఒకరు అనారోగ్యంతో ఆస్పత్రికి వస్తే రోగిని వీల్‌చైర్‌లో కుర్చోపెట్టుకుని వృద్ధులే వైద్యుల వద్దకు, అక్కడ నుంచి వార్డుకు, ఎక్స్‌రేతో పాటు పలు రకాల పరీక్షల కోసం ల్యాబ్‌లకు కూడ తీసుకు వెళ్లాల్సి వస్తుంది. వయోభారంతో వీల్‌చైర్, స్ట్రెచ్చర్లను తోసుకుంటూవారు పడే బాధలు నిత్యం రైల్వే ఆస్పత్రిలో కనిపిస్తుంటాయి.
డబ్బు కడుతున్నా అందని సదుపాయాలు
ప్రతి నెలా ఉద్యోగులు జీతంలోను, విశ్రాంత ఉద్యోగులు తమ పెన్షన్‌లో మెడికల్ ఎలవెన్స్ రూపంలో ఏటా లక్షలాది రూపాయలు చెల్లిస్తున్నారు. అయినా తమకు సరైన వైద్య సదుపాయాలు విజయవాడ డివిజనల్ రైల్వే ఆస్పత్రిలో అందడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కష్టమైనా తాముండే ప్రాంతంలోనే ప్రైవేటు ఆస్పత్రులను అశ్రయించాల్సి వస్తోందని వారు వాపోతున్నారు.
పట్టించుకోని ఉన్నతాధికారులు
రైల్వే అభివృద్ధిలో భాగస్వాములైన ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు సరైన వైద్యసేవలు అందించకుండా సిబ్బంది చిన్నచూపు చూస్తున్నారని రోగులు వాపోతున్నారు. ఆస్పత్రిలో వార్డు బాయ్స్ కూడా అందుబాటులో ఉండటం లేదని.. ఉన్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే కొన్ని విభాగాలకు వైద్యులు లేరని, సిబ్బంది కూడా అంతంతమాత్రంగా ఉన్నారు. ఇప్పటికై నా డీఆర్‌ఎం, ఏడీఆర్‌ఎం, సీఎంఎస్‌లు క్షేత్రస్థాయిలో పరిశీలించి రోగులకు మౌలిక వసతులు కల్పించాల్సి ఉంది.
ర్యాంపు మార్గంలో వీల్‌చైర్‌లో రోగిని తీసుకెళుతున్న కుటుంబ సభ్యులు
విజయవాడ ఆస్పత్రిలో దివ్యాంగులు, వృద్ధులకు కనీస సౌకర్యాలు కరవు పట్టించుకోని రైల్వే ఉన్నతాధికారులు
రైల్వే ఆస్పత్రిలో 10 విభాగాలు ఉన్నాయి. నిత్యం సుమారు 500 మంది ఓపీ వస్తారు. రైల్వే ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చే దివ్యాంగులు, నడవలేని వృద్ధులు వసతుల్లేక తిప్పలు పడుతున్నారు. రోగుల అనారోగ్య పరిస్థితి మేరకు ఆస్పత్రి సిబ్బంది వీల్‌చైర్‌లు, స్ట్రెచ్చర్లలో క్యాజ్‌వాల్టీ, సంబంధిత వైద్యుల వద్దకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆ పరిస్థితి రైల్వే ఆస్పత్రిలో కానరాదు. అత్యవసర పరిస్థితిలో కూడా రోగులు అంబులెన్స్‌లు, ప్రైవేటు వాహనాల్లో రైల్వే ఆస్పత్రులకు వస్తే అక్కడ రోగులను వెంటనే క్యాజువాల్టీకి తరలించేందుకు వార్డుబాయ్స్, ఇతర సిబ్బంది అందుబాటులో ఉండటంలేదు. దీనిపై సిబ్బందిని అడిగితే బయట వీల్‌చైర్‌లు, స్ట్రెచ్చర్లు ఉంటాయని వాటిపై రోగిని మీరే తీసుకు రావాలని చెబుతున్నారు. రోగుల సహాయకులే అవి ఎక్కడున్నాయో వెతుక్కుని వాటిలో క్యాజ్‌వాల్టీకి తీసుకెళ్తున్నారు. అక్కడ వైద్యులు పరీక్షించిన అనంతరం వారికి ఎక్స్‌రే, రక్తపరీక్షలకు వెళ్లాలన్నా బంధువులే రోగులను వీల్‌చైర్‌లు, స్ట్రెచ్చర్లలో తోసుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.

పేరుకే డివిజనల్ రైల్వే ఆస్పత్రి

పేరుకే డివిజనల్ రైల్వే ఆస్పత్రి