
ఇన్నొవేషన్ హబ్ పనులను త్వరగా పూర్తి చేయండి
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
రామవరప్పాడు: స్టార్టప్‌లు, ఆవిష్కరణలకు రతన్ టాటా ఇన్నొవేషన్ హబ్ (ఆర్‌టీఐహెచ్)తో సరికొత్త ఊపు రానుందని, ఈ హబ్‌తో పారిశ్రామిక రంగం రూపురేఖలు సమూలంగా మారనున్నాయని ఇందుకు సంబంధించి స్పోక్ కార్యాలయ పనులను త్వరితగతిన పూర్తిచేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. టాటా ఇన్నొవేషన్ హబ్– స్పొక్ కార్యకలాపాల నిర్వహణకు అవసరమైన కార్యాలయం, మౌలిక వసతుల కల్పనకు సంబంధించి ఎనికేపాడులో భవనాన్ని కలెక్టర్ లక్ష్మీశ అధికారులతో కలిసి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్‌టీఐహెచ్ కార్యకలాపాలను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
నాలుగైదు రోజుల్లో నాలుగో అంతస్తులోని ఒక బ్లాకు పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ హబ్‌కు అనుసంధానంగా విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, అనంతపూర్‌లో ప్రాంతీయ స్పోక్స్ కేంద్రాలను అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కావూరి చైతన్య, తహసీల్దారు బి. సుగుణ, ఆర్ అండ్‌బీ ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.
అధికారులతో చర్చిస్తున్న కలెక్టర్ లక్ష్మీశ