
అమెరికాలో పట్టపగలే జరిగిన దోపిడిలో ఓ భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. జార్షియా రాష్ట్రంలో మస్కోజీ కౌంటీ, ఈస్ట్ కోలంబస్ రోడ్డులో ఉన్న సైనోవస్ బ్యాంకు దగ్గర సోమవారం ఉదయం 10 గంటల సమయంలో ఈ దోపిడి చోటు చేసుకుంది. అమెరికాలో స్థిరపడిన భారతీయుడు అమిత్ కుమార్ పటేల్ మరణించాడు.
అమిత్ కుమార్ పటేల్ భార్య పిల్లలతో అమెరికాలో స్థిరపడ్డారు. పట్టణంలోని బ్యూనా విస్టారోడ్, స్టీమ్‌మిల్ రోడ్డులో గ్యాస్ స్టేషన్లు ఉన్నాయి. కాగా నగదు జమ చేసేందుకు ఆయన సోమవారం బ్యాంకు వద్దకు చేరుకున్నాడు. ఆ సమయంలో గుర్తు తెలియని ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో అమిత్ కుమార్ చనిపోయారు. అనంతరం దుండగుడు నగదుతో పరార్ అయ్యాడని స్థానిక పోలీసులు తెలిపారు.
ఇటీవల అమెరికాలో దోపిడి దారులు రెచ్చిపోతున్నారు. పట్టపగలే దారుణాలకు తెగబడుతున్నారు. నవంబరు 17న టెక్సాస్‌లో జరిగిన దాడిలో సజన్ మథ్యూ అనే అమెరికన్ భారతీయుడు మృతి చెందాడు. ఆ ఘటన మరిచిపోకముందే మరో దారుణం చోటు చేసుకుంది.