
వసతి గృహాలు, గురుకులాల్లో అభద్రతా భావం
ఇన్‌చార్జి బాధ్యతలతో ఇక్కట్లు
ఒక్క వార్డెన్ రెండు కంటే ఎక్కువ వసతి గృహాలకు ఇన్‌చార్జిగా ఉంచడం వల్ల కూడా పర్యవేక్షణ లోపిస్తోంది. ప్రస్తుతం అర్గుల్ వసతిగృహం అధికారి భీంగల్ వసతిగృహం ఇన్‌చార్జిగా కొనసాగిస్తున్నారు. ఇతను ఈ రెండు ప్రాంతాలను సమన్వయం చేసుకొని వెళ్లిరావడం ఇబ్బందికరంగా ఉండడంతో సక్రమంగా విధులు నిర్వహించలేకపోతున్నారు. ఆర్మూర్‌లో ఇద్దరు వార్డెన్‌లు ఒక్కొక్కరు మూడు చొప్పున వసతి గృహాలకు ఇన్‌చార్జులుగా కొనసాగుతున్నారు. జిల్లా కేంద్రంలోనూ ఇద్దరు వార్డెన్‌లు రెండేసి వసతి గృహాలకు ఇన్‌చార్జి బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. దీనివల్ల ఇరువైపులా పర్యవేక్షణ చేయకలేక ఇబ్బంది పడుతున్నారు.
దాడులు.. ర్యాగింగ్‌లు..
ఆత్మహత్యలు..
● తరుచూ చోటుచేసుకుంటున్న ఘటనలు
● విద్యార్థులపై కొరవడిన పర్యవేక్షణ
● ఆందోళన వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు
ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల క్షేమం, భద్రత కన్నా, ప్రమాదకర పరిస్థితులే చోటు చేసుకుంటున్నాయి. విద్యార్థులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడమే కాకుండా మానసిక ఒత్తిడి, ర్యాగింగ్ వల్ల ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు దాపురిస్తున్నాయి. నిత్యం పర్యవేక్షణ చేయాల్సిన వార్డెన్లు, అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యహరించడంతోనే ఇలాంటి పరిస్థితి నెలకొందని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నేతలు పేర్కొంటున్నారు.
నిజామాబాద్ అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంక్షేమ వసతి గృహాలు, గురుకుల విద్యాలయాలతో పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతోంది. అయితే అక్కడక్కడా చోటుచేసుకుంటున్న అవాంఛనీయ ఘటనలతో విద్యార్థుల్లో అభద్రతాభావం నెలకొంటోంది. విద్యాబోధన, పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థులు గొడవలు పడుతూ ప్రాణాలు తీసుకునే పరిస్థితులు ఎదురవుతున్నాయి. కొన్ని ప్రాంతాలలో వసతి గృహ అధికారులపై దాడులు చేసిన ఘటనలు జిల్లాలో వెలుగుచూస్తున్నాయి. వీటన్నింటికీ వసతి గృహాలపై సరైన పర్యవేక్షణ లేకపోవడం, సంబంధిత అధికారులు స్థానికంగా ఉండకపోవడమే ప్రధాన కారణాలుగా తెలుస్తోంది.
అందుబాటులో ఉండని వార్డెన్లు
జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలు పూర్తిగా అదుపుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు వసతి కల్పించి విద్యాబోధన అందించడం వీటి ముఖ్య ఉద్దేశం. కాగా ప్రస్తుతం వీటి నిర్వహణ తీరు అనేక విమర్శలకు దారితీస్తోంది. చాలా ప్రాంతాలలో వార్డెన్‌లు నిత్యం అందుబాటులో ఉండక, హాస్టల్‌లోని సీనియర్ వంటమనిషి లేదా సీనియర్ విద్యార్థికి బాధ్యతలు అప్పజెప్తూ గైర్హాజరవుతున్నారు. అలాగే జిల్లాలోని గురుకుల విద్యాలయాల్లో పర్యవేక్షణ లేక ర్యాగింగ్‌లు, జూనియర్ విద్యార్థులను సీనియర్లు వేధింపులకు గురిచేయడం వంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి.

వసతి గృహాలు, గురుకులాల్లో అభద్రతా భావం