
ఉచిత శిక్షణ.. ఉపకార వేతనం
నందిపేట్: పేద విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు తన మేధాశక్తిని పంచుతూ స్టడీ మెటీరియల్‌ను అందిస్తున్నాడు నందిపేట్ మండలం లక్కంపల్లికి చెందిన సౌదారి సాగర్. గత 15 ఏళ్లుగా 76 మంది పేద విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేశాడు. ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్‌షిప్ (ఎన్‌ఎంఎంఎస్) పేరిట ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద పిల్లలకు ఉపకార వేతనాలు అందిస్తుంది. 8వ తరగతి అర్హత సాధిస్తే ఇంటర్ వరకు నాలుగేళ్ల పాటు నెలకు రూ. వెయ్యి ఉపకార వేతనం అందిస్తుంది. ఇలా ఒక్కో విద్యార్థికి రూ. 48 వేలు ఆర్థిక సహాయం అందుతుంది. అత్యంత కీలకమైన పది, ఇంటర్ చదువులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ సాయం ఆసరా అవుతుంది. కాగా ఇందుకుగాను ఎన్‌ఎంఎంఎస్ పరీక్షలో మంచి మార్కులు సాధిస్తే ఉపకార వేతనాలకు ఎంపికవుతారు.
15 ఏళ్లుగా శిక్షణ..
ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించే విద్యార్థులు పడుతున్న కష్టాలను స్వయంగా అనుభవించిన సాగర్ వారిలో ఉత్సాహం, ఉత్తేజం నింపేందుకు వారి తల్లిదండ్రులు ప్రోత్సహించేలా వెన్నుతట్టాడు. ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు చేతనైనంత సాయం చేయాలని భావించిన సాగర్ గత 15 ఏళ్లుగా 2009 నుంచి ఉచితంగా ఎన్‌ఎంఎంఎస్ పరీక్షలకు విద్యార్థులకు సన్నద్ధం చేసేందుకు బోధించడం మొదలుపెట్టాడు. ఉన్నంతలో పుస్తకాలు, స్టడీ మెటీరియల్ అందించి విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నాడు. కీలకమైన మేధానైపణ్యంపై దృష్టిపెట్టి శిక్షణ అందిస్తూ వారిని ముందుకు నడిపిస్తున్నాడు. ఇలా ఇప్పటి వరకు 76 మంది విద్యార్థులు ఎన్‌ఎంఎంఎస్ ప్రతిభా పరీక్షకు ఎంపికయ్యారు. వారంతా ఇప్పుడు ఐఐటీ, ఐఐఐటీల్లో చదువుతున్నారు.
ఎన్‌ఎంఎంఎస్ కోసం విద్యార్థులకు శిక్షణ
పదిహేను ఏళ్లుగా ఉదారంగా
సేవలందిస్తున్న సౌదారి సాగర్
పేద విద్యార్థుల కోసం..
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు హైస్కూల్, ఇంటర్ స్థాయిలో ఆర్థికపరమైన ఇబ్బందులతో అనేక మంది చదువుకు దూరమవుతున్నారు. కేంద్రం అందించే ఉపకార వేతనం అందితే వారికి ఎంతో చేయూత కలుగుతుందని భావించాను. నాకున్న ఖాళీ సమయాన్ని వారి కోసం వినియోగిస్తున్నాను.
– సౌదారి సాగర్, లక్కంపల్లి, నందిపేట

ఉచిత శిక్షణ.. ఉపకార వేతనం