
చోరీ కేసులో ఒకరి అరెస్ట్
కమ్మర్‌పల్లి: కమ్మర్‌పల్లి మండలం ఉప్లూర్, కమ్మర్‌పల్లి, ఏర్గట్ల మండలం తొర్తి ఆలయాల్లో దొంగతనం చేసిన కేసులో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కమ్మర్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భీమ్‌గల్ సీఐ పీ సత్యనారాయణ వివరాలను వెల్లడించారు. ఉప్లూర్ ఎల్లమ్మ, పోచమ్మ, పెద్దమ్మ ఆలయాలు, కమ్మర్‌పల్లి గుండ్లకుంట హన్మాన్, ఏర్గట్ల మండలం తొర్తిలో శుక్రవారందేవీ ఆలయాల్లో మూడు నెలల క్రితం చోరీ జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బుధవారం కమ్మర్‌పల్లి మండల కేంద్రంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం రేగుర్తి గ్రామానికి చెందిన తూర్పాటి కనకయ్యను అదుపులోకి తీసుకొని విచారించగా ఆలయాల్లో దొంగతనానికి పాల్పడింది తానేనని ఒప్పుకున్నాడు. నిందితుడి నుంచి రూ.2,700 నగదుతోపాటు ఆలయాల్లో దొంగిలించిన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. కేసు ఛేదనలో పాల్గొన్న ఐడీ పార్టీ కానిస్టేబుళ్లు షౌకత్ అలీ, నవీన్‌చంద్ర, వినయ్‌ను అభినందించారు. కార్యక్రమంలో ఎస్సై అనిల్‌రెడ్డి పాల్గొన్నారు.