
కార్పొరేషన్ కహానీ–1
సుభాష్‌నగర్: నిజామాబాద్ నగరం మున్సిపల్ కార్పొరేషన్ హోదా దక్కించుకుని 20 ఏళ్లు గడుస్తున్నా నగరవాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు మాత్రం అలానే ఉన్నాయి. కార్పొరేషన్ స్థాయిలో పన్ను వసూలు చేస్తున్నా సౌకర్యాలు మాత్రం అధ్వానంగా ఉన్నాయి. ముఖ్యంగా రోడ్లు, ఫుట్‌పాత్‌లు, ట్రాఫిక్ సమస్య ప్రజలను తీవ్రంగా వెంటాడుతోంది. పెద్దపెద్ద వ్యాపార సముదాయాలకు అనుమతులు ఒక రకంగా తీసుకుంటూ మరో రకంగా నిర్మాణాలు చేపట్టడమే ఇందుకు కారణమవుతోంది. కొన్ని చోట్ల ఫుట్‌పాత్‌లపై వ్యాపారాలు చేస్తుండగా, మరికొన్ని చోట్ల వాహనాలు పార్కింగ్ చేస్తున్నారు.
నిజామాబాద్ నగరంలో సుమారు ఐదు లక్షల మంది నివసిస్తుండగా, వివిధ ప్రాంతాల నుంచి పనుల నిమిత్తం ప్రతిరోజూ వేల సంఖ్యలో వస్తూవెళ్తుంటారు. ప్రస్తుతం నిజామాబాద్‌లో 1972 మాస్టర్ ప్లాన్ అమలవుతోంది. చాలా ప్రాంతాల్లో రోడ్లు చిన్నగా ఉండగా, విస్తరణ కోసం ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం 20 ఏళ్లుగా ఎలాంటి చొరవ తీసుకోకపోవడం, గడిచిన 15 ఏళ్లలో వాహనాల వినియోగం విపరీతంగా పెరగడంతో ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది.
టౌన్ ప్లానింగ్ బాధ్యత మరిచిందా?
నగరంలో నిత్యం వందల సంఖ్యలో నూతన నిర్మాణాలు చేపడుతున్నారు. ముఖ్యంగా వ్యాపార సముదాయాలు ఉన్న ప్రాంతాల్లో భవనాల నిర్మా ణాల విషయంలో టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనుమతుల ఓ రకంగా.. నిర్మాణాలు మరో రకంగా ఉంటున్నాయంటూ ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. అయితే ఆ ఫిర్యాదులు అధికారులకు కాసులు కురిస్తున్నాయని, తూతూ మంత్రంగా తనిఖీలు చేపట్టి చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సెల్లార్లు నిర్మిస్తున్నా.. వాటిని ఇతర అవసరాలకు వాడుతున్నారనేది బహిరంగ రహస్యం. ఇళ్ల నిర్మాణాలను క్షుణ్ణంగా పరిశీలించే అధికారులు.. వ్యాపార సముదాయాల విషయంలో మాత్రం ఎందుకంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది.
మాస్టర్ ప్లాన్ కోసం ఎదురుచూపులు
నగరంలో కొత్త మాస్టర్ ప్లాన్ అమలైతే అనేక సౌకర్యాలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. ముఖ్యంగా విశాలమైన రోడ్లు, పార్కులు అందుబాటులోకి వస్తాయి. మాస్టర్ ప్లాన్ అమలైతే ట్రాఫిక్ సమస్యకు కొంతవరకు పరిష్కారం లభిస్తుంది. వ్యాపార సముదాయాలున్న ప్రాంతాల్లోని ప్రభుత్వ స్థలాల్లో పార్కింగ్ (టెండర్) ఏర్పాటు చేస్తే ఫుట్‌పాత్‌లపై వాహనాల పార్కింగ్‌కు అవకాశం ఉండదు. అదేవిధంగా వ్యాపార సముదాయాల నిర్మాణం విషయంలో టౌన్ ప్లానింగ్ అధికారులు నిక్కచ్ఛిగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వన్ వేలు చేయడం, వీధి వ్యాపారాలను కంట్రోల్‌లో ఉంచడం, అక్రమ పార్కింగ్‌లపై స్పెషల్ డ్రైవ్ చేపట్టడం వంటి వాటితో ట్రాఫిక్, ఫుట్‌పాత్ సమస్యను చెక్ పెట్టొచ్చని నగరవాసులు అంటున్నారు.
ఫుట్‌పాత్‌ను ఆక్రమించి వ్యాపారం.. రోడ్డుపై పార్కింగ్..
రాజీవ్‌గాంధీ ఆడిటోరియం రోడ్డులో ట్రాఫిక్

కార్పొరేషన్ కహానీ–1