
అవసరం మేరకే ఎరువులు తీసుకోవాలి
ఇందల్వాయి: యూరియాతో సహా అన్ని ఎరువుల నిల్వలు సరిపడా అందుబాటులో ఉన్నాయని, రైతులు ప్రస్తుత అవసరం మేరకే ఎరువులను కొనుగోలు చేసుకోవాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. ముందస్తుగా నిల్వ చేసుకోవద్దని సూచించారు. ఇందల్‌వాయి మండల కేంద్రంలో కలెక్టర్ మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తహసీల్ కార్యాలయంతోపాటు రేషన్ షాపు, ఎరు వుల దుకాణం, గ్రామీణ పశు వైద్యశాలను సందర్శించి పని తీరును పరిశీలించారు. ముందుగా తహసీల్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ భూ భారతి రెవెన్యూ సదస్సుల ద్వారా అందిన దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 3480 దరఖాస్తులు అందాయని తహసీల్దార్ వెంకట్‌రావు తెలుపగా.. దరఖాస్తుదారులకు రసీదులు అందించారా అని కలెక్టర్ ఆరా తీశారు. అనంతరం 12 నంబర్ రేషన్ దుకాణాన్ని తనిఖీ చేశారు. లబ్ధిదారులకు మూడు నెలలకు సంబంధించి సన్నబియ్యం పంపిణీ పూర్తయ్యిందా అని డీలర్‌ను ప్రశ్నించగా, జూన్ నెలాఖరునాటికే పూర్తి చేశామని ఆయన సమాధానమిచ్చారు. అక్కడి నుంచి ఎరువుల పంపిణీ కేంద్రానికి చేరుకొని స్టాక్‌ను పరిశీలించారు. ఎరువుల కొనుగోలు కోసం వచ్చిన రైతులతో మాట్లాడారు. అవసరమైన ఎరువులు సక్రమంగా అందుతున్నాయా అని ప్రశ్నించగా రైతులు అందుతున్నాయని సమాధానమిచ్చారు. అక్కడి నుంచి గ్రామీణ పశు వైద్యశాలకు చేరుకున్న కలెక్టర్.. భవనాన్ని పరిశీలించారు. అవసరమైన మరమ్మతులు చేయించాలని పశువైద్యుడు గంగాప్రసాద్‌కు సూచించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ వెంకట్రావు, మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్ తదితరులున్నారు.
అందుబాటులో యూరియా సహా
ఇతర ఎరువులు
ఇందల్‌వాయిలో కలెక్టర్
వినయ్‌కృష్ణారెడ్డి
రేషన్ దుకాణం, ఎరువుల పంపిణీ
కేంద్రం, పశువైద్యశాల సందర్శన
భూభారతి దరఖాస్తులపై ఆరా